May 30,2023 09:59

చాలామంది బొప్పాయి పండును తినేసి దాని గింజలను చెత్తబుట్టలో పడేస్తారు. కానీ ఈ విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
జలుబు, ఫ్లూ నుండి రక్షణ : బొప్పాయి గింజలలోని పాలీఫెనాల్స్‌, ఫ్లేవలోయిడ్స్‌ వంటి యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది ఇన్ఫెక్షన్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జలుబు, ఫ్లూ వంటి అనేక వ్యాధుల ప్రమాదం నుండి రక్షిస్తుంది.
కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది : బొప్పాయి గింజలు కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ధమనులలో ఫలకం తగ్గినప్పుడు, రక్తపోటు తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
బరువు తగ్గడం : బొప్పాయి గింజల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగుతున్న బరువు కూడా తగ్గుతుంది.

                                                         బొప్పాయి గింజలను ఎలా తీసుకోవాలి ?

ఈ విత్తనాలను నీటిలో కడిగి, ఎండలో బాగా ఆరబెట్టండి. బాగా ఎండిన గింజలను గ్రైండ్‌ చేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని మిల్క్‌ షేక్‌, స్వీట్స్‌, జ్యూస్‌ మొదలైన వాటిలో కలపవచ్చు. తీపి పదార్థాలతో కలపడం వల్ల సహజంగా గింజలకు ఉండే చేదు రుచి పోతుంది. దీంతో రుచిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.