Jun 30,2022 21:03

ప్రజాశక్తి -కోటవురట్ల, అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో బుధవారం గేదెను చంపిన పులి గురువారం యలమంచిలి అటవీ జోన్‌ ప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చని అటవీ శాఖాధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అటవీ అధికారులు సీసీ కెమెరాతో ట్రాప్‌ చేసిన ఎటువంటి ఆధారాలూ చిక్కలేదని తెలిపారు. కోటవురట్ల మండలంలోని రామచంద్రపురం, పొందూరు ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించడంతో యలమంచిలి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు నర్సీపట్నం రేంజర్‌ రాజబాబు తెలిపారు. గురువారం ఈ ప్రాంతంలో ఎటువంటి దాడీ జరగకపోవడంతో ఎక్కడుందన్న విషయం తెలియడంలేదన్నారు. పులి దాడిలో మరణించిన పశువుకి నష్టపరిహారాన్ని యజమానికి అందజేయాలని సిపిఎం నాయకులు అప్పలరాజు డిమాండ్‌ చేశారు.