Mar 26,2023 11:08

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడమంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 26న విజయవాడలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర బిజెపి హయాంలో కక్ష సాధింపులు, నిరంకుశత్వాలు, అరాచకాలు తప్ప ప్రజాస్వామ్య రాజకీయాలు కనిపించడం లేదన్నారు.రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం వెనుక బిజెపి, ప్రధాని మోడీ కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయన్నారు. అనంతరం రాజీవ్‌ గాంధీ ఫొటో ఉన్న సత్యమేవ జయతే అనే పోస్టరును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.