Sep 29,2022 21:34

- తలోజా జైలు అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం
- చికిత్స పొందడం ప్రాథమిక హక్కు అని ఉద్ఘాటన

న్యూఢిల్లీ : జైలులో నిర్బంధంలో ఉన్న వ్యక్తి చికిత్స పొందడమనేది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు గురువారం నాడు నొక్కి చెప్పింది. ఎల్గార్‌ పరిషద్‌ - మావోయిస్టులతో సంబంధముందన్న కేసులో తలోజా జైలులో ఉన్న సామాజిక కార్యకర్త గౌతమ్‌ నవలఖను తక్షణమే ముంబయిలోని జస్లోక్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆసుపత్రిలో నవలఖను కలుసుకునేందుకు ఆయన జీవిత భాగస్వామి సభా హుస్సేన్‌కు, ఆయన సోదరికి అనుమతి ఇస్తూ జస్టిస్‌ కెఎం జోసెప్‌, జస్టిస్‌ హరిషికేశ్‌ రారుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. 'ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత చికిత్స పొందడం అనేది ప్రాథమిక హక్కుగా మేము గుర్తు చేయదల్చాము. వైద్య పరీక్షల నిమిత్తం పిటిషనరు (నవలఖ)ను తక్షణమే ఆసుపత్రికి తరలించాలని ఆదేశిస్తున్నాం' అని ధర్మాసనం పేర్కొంది. అవసరమైన వైద్య పరీక్షలు చేయించేందుకు, ఆ తర్వాత చికిత్స అందించేందుకు వీలుగా పిటిషనర్‌ను ముంబయిలోని జస్కోల్‌ ఆసుపత్రికి తరలించాల్సిందిగా తలోజా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అయితే ఆయన పోలీసు కస్టడీలోనే ఉండాలని స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకునేందుకు వీలుగా తనను జైలులో కాకుండా గృహనిర్బంధంలో ఉంచాలని కోరుతూ బంబే హైకోర్టులో నవలఖ పిటిషన్‌ దాఖలు చేసుకోగా..ఆయన విన్నపాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు గత ఏప్రిల్‌ 26న ఉత్వర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అనుమతిస్తూ పై ఉత్తర్వులు వెలువరించింది.