
గుంటూరు జిల్లా : అధికార వైసిపి నేతలు ఓ గిరిజన రైతు భూమిని కబ్జా చేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రూరల్ మండలంలోని ఓబుల్ నాయుడు పాలెంలో ఓ లంబాడి కులానికి చెందిన రైతు ఓబుల్ నాయక్ పొలాన్ని వైసిపి నేతలు రాత్రికి రాత్రి ఆక్రమించి.. తెల్లవారేసరికి జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇదేంటని ప్రశ్నించిన రైతును చంపేస్తామని, పొలంలో పాతిపెడతామని బెదిరించారని బాధితుడు మీడియాకి చెబుతూ.. కన్నీరు పెట్టుకున్నాడు. ఈ పొలం తమదని, దిక్కున్నచోట చెప్పుకోవాలని, తాము సుచరిత మనుషులమని వైసిపి నేతలు అన్నారని వాపోయాడు. అయితే వాళ్ల లారీకి తాను అడ్డంగా నిలుచుంటే తొక్కించేస్తామని బెదిరించారని, తనకు న్యాయం చేయాలని రైతు వేడుకున్నాడు. అధికారులు, పోలీసులు పట్టించుకోలేదన్నాడు. సుచరిత పేరు చెప్పి తన పొలంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని, లేని పక్షంలో కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఓబుల్ నాయక్ కన్నీటిపర్యంతమయ్యాడు.