
- పులివెందుల కోర్టులో వాగ్మూలం
ప్రజాశక్తి - కడప ప్రతినిధి/పులివెందుల టౌన్ :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సతీమణి తులసమ్మ శనివారం పులివెందుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసులో మరో ఆరుగురు నిందితులు ఉన్నారని, వారినీ విచారించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలమిచ్చారు. ఈ సందర్భంగా తులసమ్మ తరపు న్యాయవాది రవీందర్‌రెడ్డి కడప ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తొమ్మిది నెలల కిందట వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్, బి.టెక్ రవి, రాజేశ్వర్ రెడ్డిని విచారించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. వారిని కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన ఒకరిని అఫ్రూవర్‌గా మార్చుకుని దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని ఇరికించారని ఆరోపించారు. కేసును తప్పు దారిపట్టించేందుకు ఇతరులపై కేసులు పెడుతున్నారన్నారని తెలిపారు. సిబిఐ పరిగణలోకి తీసుకున్న కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టాలని కోరారు.