Jun 29,2022 18:44

'నేను ఐదు నెలల వరకు సరిగ్గా భోజనం చేయలేదు. నిద్ర పోలేదు. కనీసం దాహమేస్తే మంచినీళ్లు తాగాలనిపించలేదు' అని చెబుతున్నప్పుడు జావేద్‌ షేక్‌ చేతులు వణుకుతూ కనిపించాయి. భయంతో గొంతు జీరబోయింది. ఆ సంఘటన జరిగి 20 ఏళ్లు కావస్తోంది. కాని ఆ దృశ్యం ఇప్పుడు అతని కళ్లముందే జరుగుతున్నట్లుగా వణికిపోతున్నాడు. అతన్ని అంతలా భయపెట్టిన ఆ ఉదంతం ఏంటి?

ఆ రోజు జావేద్‌ శవాల కుప్పకింద తలదాచుకున్నాడు. తల్లిదండ్రులు, అక్క అతని కళ్లముందే చంపబడ్డారు. ఓ నిండు గర్భిణీపై అత్యాచారం చేసిన దుండగులు... ఎంతోమంది మహిళలపై అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడి వికటాట్టహాసం చేస్తున్న దృశ్యాలు.. ఆ శవాల కింద శవంలా పడి ఉన్న జావేద్‌ కంటికి ఇప్పటికీ స్పష్టంగా కనపడుతున్నాయి. అప్పటి నుంచి పిచ్చివాడిలా తిరుగుతున్న జావేద్‌ ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా దిగాలుగా ఉంటాడంటుంది అతని భార్య.

gujarat,  godhra case, jeevana, features

ఆ ఊచకోత జరిగి ఇప్పటికి 20 ఏళ్లు అయినా బాధితుల ఆర్తనాదాలు.. రక్తమోడుతున్న దేహాలు.. అవయాలు తెగిపడుతున్నా ప్రాణభీతితో పరుగులెడుతున్న శరీరాలు.. కత్తులు, కటార్లతో భయంకర అరుపులతో దాడిచేస్తున్న మూకలు.. వికటాట్టహాసాలు బాధితులను నిత్యం వెంటాడుతున్నాయి. 2002 గుజరాత్‌ మారణహోమంలో 2 వేలమందికి పైగా మృత్యువాత పడితే వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఆ భయానక దుర్ఘటన బాధితులకు జీవితకాల రోదనలు మిగిల్చింది.

ఆ అల్లర్లలో చనిపోయిన వారి వివరాలు తెలిసినంతగా అనాథలుగా మిగిలిన వారి వివరాలు ఇప్పటికీ లేవు. కుటుంబాలను కోల్పోయి ఎంతమంది ఒంటరి జీవితాలు అనుభవిస్తున్నారో లెక్కలేదు. దాడులకు ప్రత్యక్ష సాక్ష్యులుగా ఉన్నవారు రోజూ చస్తూ బతుకుతున్నారు. వారి మాటల్లో చెప్పాలంటే 'ప్రతిరోజూ చావు వరకు వెళ్తున్నాం' అంటారు. బాధితుల పునరావాసం కోసం నిర్మించిన శిబిరాలనే శాశ్వత గృహాలుగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అరకొరా వసతులతోనే బతుకులీడుస్తున్న ఆ అభాగ్యులు, వారి పిల్లలు తీవ్ర శారీరక, మానసిక వ్యాధులతో నిత్యం పోరాడుతున్నారు.

gujarat,  godhra case, jeevana, features

ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులతో పాటు ఇక్కడ తలదాచుకుంటున్న ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు' అంటారు మొయిద్దీన్‌ షేక్‌. అల్లర్లను నియంత్రించాల్సిన పోలీసు బలగాల చేష్టలుడిగిన చర్యలకు అతను ప్రత్యక్ష సాక్షి. షేక్‌ మాజీ పోలీసు. అల్లర్ల తరువాత అతను ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూకదాడి భయంతో పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు. బిడ్డలను ఉన్నత విద్య చదివించాలనుకుని ఎన్నో ఆశలతో ఉద్యోగంలోకి అడుగుపెట్టిన షేక్‌ ఆశలు తలకిందులయ్యాయి. ఆ దాడి తరువాత ఎందరో పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. షేక్‌ మాటల్లో చెప్పాలంటే '2002 తరువాత ఐదేళ్లపాటు పిల్లలంతా కోమాలో ఉన్నట్లుగా ఉండేవారు. ఎటూ కదిలేవారు కాదు.. ఏమీ చేసేవారు కాదు.. రాత్రి పగలు తేడా లేకుండా అలా పడుకునే ఉండేవారు. ఎప్పుడో నిద్రలోకి జారుకున్నా ఒక్క ఉదుటున లేచి 'పప్పా వాళ్లు వచ్చేస్తున్నారు.. మమ్మల్ని చంపేస్తారు. కాల్చేస్తారు..' అంటూ భయంతో వణికిపోయేవారు. ఆ భయానక దృశ్యాలు వారి మనసుల్లో అంతలా ముద్రవేసుకుపోయాయి' అని ఆవేదనా స్వరంతో చెబుతారు.

గుజరాత్‌ అల్లర్ల బాధితుల్లో ఒకరైన బిల్కిస్‌ యాకూబ్‌ రసూల్‌ (బిల్కిస్‌ బాను) గిరిజన తెగకు చెందిన యువతి. అల్లర్లలు జరిగినప్పుడు ఆమె ఐదునెలల గర్భవతి. ముస్లిం యువతి అన్న కారణంగా విద్వేషంతో రగిలిపోయిన మూక ఆమెపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసింది. 'సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన జరిగిన మరుసటి రోజే మా గ్రామంలో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ముస్లిం ఇళ్లను లక్ష్యం చేసుకుని రాళ్లవర్షం కురిపించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పారిపోయాం. సుమారు 500 మంది పిల్లలతో సహా మాజీ సర్పంచ్‌ ఇంట్లో తలదాచుకున్నాం. పోలీసు భద్రత ఇవ్వాలని కోరినా వారు నిరాకరించారు. అర్ధరాత్రి దాటాక కూడా వందలాది మంది వీధుల్లో తిరుగుతూ మా ఇళ్లను కాల్చివేశారు. మమ్మల్ని కూడా చంపుతాం.. నరుకుతాం అంటూ బిగ్గరగా కేకలు వేశారు. మాలో చాలామంది అడవిలోకి పారిపోయారు.

ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు తిండి, నీరు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తలదాచుకున్నాం. అయితే ఆశ్రయం ఇచ్చినవారిని బెదిరిస్తూ మమ్మల్ని ఇంటినుంచి తరిమివేయమని, లేకపోతే చంపుతామని మా ముందే ఫోన్లు వచ్చేవి. అలా మేమంతా సర్పంచి ఇంటి నుంచి బయటికి వచ్చేశాం. ఆ తరువాత చెల్లాచెదురైన మేము ఆశ్రయం కోసం పిచ్చివాళ్లలా ఇళ్లిళ్లూ తిరిగాం. ఎవరూ మమ్మల్ని ఆదరించలేదు. ఇంతలోనే ఆ మూక మాపై దాడి చేసింది. 17 మంది కుటుంబ సభ్యుల్లో 13 మందిని చంపేశారు. వారిలో నా మూడేళ్ల కూతురు కూడా ఉంది. నాపై అనేకమంది వంతులవారీగా అత్యాచారం చేసి దూరంగా ఎత్తిపడేశారు. నేను చనిపోయాననుకుని వదిలి వెళ్లిపోయారు. కొన్ని గంటల తరువాత నాకు తెలివి వచ్చింది. నా ముందు చచ్చిపడి ఉన్న అమ్మానాన్న, అత్తామామ, అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ, ఇంకా అనేకమంది అవయవాలు తెగిపడి తలోదిక్కూ పడిఉన్నారు. ఆ దృశ్యం నా కళ్లముందు ఇప్పటికీ కదలాడుతూ ఉంటుంది' అంటున్న బాను న్యాయం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసింది.

బాధితుల తరపున నిలబడిన ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు న్యాయం కోసం నేటికీ పోరాటం చేస్తున్నారు. అయినా కుటుంబాలకు కుటుంబాలను పోగొట్టుకుని బతికున్న శవాలుగా జీవిస్తున్న బాధితుల ఆర్తనాదాలు ఈ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఇటీవల ఈ కేసుపై విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ అల్లర్లకు ప్రధాన బాధ్యులుగా ఉన్నవారంతా అమాయకులని, నిరపరాధులని, అన్యాయంగా ఈ కేసులో వారిని ఇరికించారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితుల పక్షాన నిలబడిన వారిపై నిందలు వేసింది. ఫలితంగా వారంతా ఒక్కొక్కరిగా జైలు పాలవుతున్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన ఎంతమందిని ఇలా నిర్బంధిస్తారు? న్యాయం కోసం పోరాడడమే నేరమా? ఏ కాలంలో ఉన్నాం మనం? ఎటుపోతోంది దేశం?