May 29,2023 20:42

ప్రజాశక్తి - కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా కశింకోట మండలం వెదురుపర్తి సమీపంలో సోమవారం శారదా నదిలో ఈతకు దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెంనకు చెందిన పిల్లి లక్ష్మి ఆమె కుమారుడు అనిల్‌ (14), నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చెందిన ఏడిద ప్రసాద్‌ (17) వేసవి సెలవులకు కశింకోట మండలం వెదురుపర్తి గ్రామంలో ఉన్న లక్ష్మి తండ్రి పలివల అప్పన్న ఇంటికి వచ్చారు. సోమవారం లక్ష్మి బట్టలు ఉతికేందుకు తేగాడ - వెదురుపర్తి మధ్యలో ఉన్న శారదా నదికి బయలుదేరగా అనిల్‌, ప్రసాద్‌ కూడా వెళ్లారు. ఆమె ఆ పనిలో నిమగమైన సమయంలో అనిల్‌, ప్రసాద్‌ నదిలోకి ఈతకు దిగారు. లోతును అంచనా వేయలేక నదిలో ముందుకు వెళ్లి గల్లంతయ్యారు. వారి కోసం సాయంత్రం వరకూ గాలించినా ఆచూకీ లభించలేదు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి పరిశీలించారు.