Sep 29,2022 21:25
  •  సంస్మరణ కార్యక్రమంలో మంత్రి రోజా
  •  మీరే మా స్ఫూర్తి : హీరో ప్రభాస్‌

ప్రజాశక్తి - మొగల్తూరు ( పశ్చిమగోదావరి) : సినీనటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు పేరు తరతరాలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాలు కేటాయించి, అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కె.రోజా తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. సినీ నటులు ప్రభాస్‌, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను రోజాతోపాటు రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్‌, జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌, పాలకొల్లు, భీమవరం ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గ్రంధి శ్రీనివాస్‌ పరామర్శించారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. మొగల్తూరు పేరు ప్రఖ్యాతలు ప్రపంచస్థాయిలో తెలిసేలా చేసిన ఘనత కృష్ణంరాజుకే దక్కుతుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కారుమురి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణంరాజు అకాల మరణం తీరనిలోటన్నారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు మచ్చలేని నాయకుడని కొనియాడారు. అంతకుముందు హీరో ప్రభాస్‌ అభిమానులద్దేశించి మాట్లాడారు. 'ఐలవ్‌ యూ పెదనాన్న.. మీరు మా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. మీ జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలమే. మీరే మా స్ఫూర్తి. మీ అడుగు జాడల్లోనే'' నడుస్తానంటూ పేర్కొన్నారు. అందరూ భోజనం చేసి వెళ్లాలని అభిమానులను కోరారు. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం నేపథ్యంలో చాలాకాలం తర్వాత సినీనటులు ప్రభాస్‌ మొగల్తూరు వచ్చారు. ఆయనను చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు తరలి రావడంతో రహదారులన్నీ కిటకిటలాడాయి. 650 మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

krishnamraj

 

krishnam raju