Sep 22,2022 21:01

ప్రజాశక్తి - ఏ కొండూరు :ఎన్‌టిఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం గిరిజన తండాల్లో కిడ్నీ వ్యాధితో గురువారం ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణారావుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని దీప్లానగర్‌ తండాకు చెందిన భూక్యా బాబ్జి (50) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వ్యాధి తీవ్రత కారణంగా మృతి చెందారు. బాబ్జి భార్య, తండ్రి గతంలోనే కిడ్నీ వ్యాధితోనే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మత్రియా తండాకు చెందిన ధారావతు సరోజిని (52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. సరోజినికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులను సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు పి.ఆనందరావు, ధారావతు రాముడు తదితరులు పరామర్శించి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.