
కొనుగోలుకు చర్చలు
జురిచ్ : ఆర్థిక బలహీనతలను ఎదుర్కొంటున్న స్విజ్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సుస్సెను కొనుగోలు చేయడానికి బ్యాంకింగ్ దిగ్గజం యుబిఎస్ ఆసక్తి చూపుతోంది. ఇరు సంస్థల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని శనివారం పలు రిపోర్టులు వచ్చాయి. క్రెడిట్ సుస్సెను సంక్షోభం నుంచి బయటపడేయడానికి స్విస్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొంటోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ వ్యాపారాలను మరో దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ కొనుగోలు చేసేలా ప్రయత్నిస్తోంది. క్రెడిట్ సుస్సెను మొత్తాన్ని లేదా కొన్ని వ్యాపారాలను కొనుగోలు చేసే అంశంపై సంప్రదింపులు చేస్తోంది. స్విస్ అధికారుల మద్దతుతోనే యుబిఎస్ ముందుకు వచ్చింది. ఈ వారాంతంలో రెండు బ్యాంకుల బోర్డులు స్విస్ నేషనల్ బ్యాంక్, అక్కడి నియంత్రణ సంస్థ ఫిన్మాతో వేర్వేరుగా భేటీ అయి చర్చలు జరపనున్నాయని రాయిటర్స్ ఓ రిపోర్టులో తెలిపింది. ఆదివారం సాయంత్రం నాటికి దీనిపై స్పష్టత రానుందని పేర్కొంది. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న క్రెడిట్ సుస్సె 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 85 శాతం పతనమయ్యింది. గత వారం అమెరికన్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత క్రెడిట్ సుస్సెపై మరింత ఒత్తిడి పెరిగింది.