Mar 22,2023 08:23

క పాఠశాల ఉపాధ్యాయిని తన విద్యార్థులతో ఇలా అన్నది : పిల్లలూ.. ఉగాది పండుగ వస్తుంది కదా! దాని గురించి మీరు చెప్పాలి. మీ తాతయ్య నాన్నమ్మలనో, అమ్మానాన్నలనో అడిగి తెలుసుకోండి. రేపు వచ్చి, మీ సొంత మాటల్లో చెప్పండి. చక్కగా చెప్పిన వాళ్లకు నేనొక మంచి బహుమతి ఇస్తాను.'' అంది.
       పిల్లలందరూ అలాగేనని తలలూపారు. క్లాసులో రవి చురుకైనవాడు. పాఠశాల విడిచి పెట్టాక రవి ఇంటికి చేరుకొని అమ్మ దగ్గరకు వెళ్ళాడు. రవి వెనకాలే వాళ్ల నాన్నమ్మ కూడా వారి దగ్గరకు వచ్చింది. అమ్మను ఉగాది పండుగ గురించి చెప్పాలని గోముగా అడిగాడు. తాను పనిలో ఉన్నానని, నాన్నమ్మను అడగమని పురమాయించింది అమ్మ.
     రవి నాన్నమ్మను అడిగాడు. నాన్నమ్మ ఇలా చెపిపంది : 'ఉగాది తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ. ఉగాదినే తెలుగు సంవత్సరాది, యుగాది అని అంటారు. ఎందుకంటే, తెలుగు సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది కాబట్టి. శిశిర రుతువు ఆకురాల్చు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగురించి ప్రకృతి అంతా పచ్చదనంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ కొత్త సంవత్సరాన్ని తెలుగు ప్రజలందరూ ఆనందంతో జరుపుకుంటారు. ఉగాది పచ్చడి చేస్తారు. దానిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరురుచులూ ఉంటాయి. ఈ షడ్రుచులు కష్టసుఖాలకు ప్రతీకగా నిలుస్తాయి.' అని చెప్పింది.
మరుసటి రోజు రవి బడికి హుషారుగా బయలుదేరాడు. ఉపాధ్యాయిని అడగగానే ... నాన్నమ్మ చెప్పిన ఉగాది పండుగ విశిష్టతను పూసగుచ్చినట్లు చెప్పాడు. మరి కొంతమంది విద్యార్థులు కూడా చెప్పారు. కానీ రవి చెప్పిన విధానం నచ్చడంతో టీచర్‌ రవికే ప్రధమ బహుమతి ఇచ్చారు. ఆ బహుమతిని తీసుకొని సరాసరి నాన్నమ్మ చేతిలో పెట్టాడు. అది చూసి నాన్నమ్మ, రవిని ముద్దులతో ముంచెత్తింది.

- గంధవరపు పల్లవి కలాం,
9వ తరగతి, జి. ప. ఉన్నత పాఠశాల,
బొద్దాం, విజయనగరం జిల్లా,
9391814366.