
అనగనగా ఓ రాజు.. ఆ రాజు ప్రాణం ఏడు సముద్రాల అవతల చెట్టు తొర్రలోని పిట్టలో ఉందని కథలు విన్నాం కదా.. అలాగే ఓ రహదారి... అదీ ఏడు వేల సంవత్సరాల నాటిది.. ఎక్కడుందో తెలుసా..? సముద్రం అడుగున ఉంది. భలే విచిత్రంగా ఉంది కదా.. దాన్ని చూసిన వారెవరైనా వారెవా! అనాల్సిందే. మరి ఆ రోడ్డు మార్గం ఏమిటో.. సముద్రం అడుగున ఉండటమేమిటో తెలుసుకుందాం..
మధ్యదరా పురావస్తు శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఏడు వేల ఏళ్ళ నాటి ఓ రోడ్డు మార్గాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మధ్యదరా సముద్రం అడుగున ఈ అతి పురాతన రోడ్డు మార్గాన్ని గుర్తించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ రహదారి మార్గం క్రొయేషియన్ ద్వీపంలోని కోర్కులా తీరాన్ని కలుపుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పురాతన రహదారి మార్గం హ్వార్ సంస్కృతికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ రహదారి నాలుగు మీటర్ల వెడల్పుతో ఉంది. కొండ రాళ్లను ఒక క్రమ పద్ధతిలో పేర్చి, ఈ రహదారిని నిర్మించినట్లు తెలుస్తోంది.
- నైపుణ్యంతో నిర్మాణం..
ఎంతో నైపుణ్యంతో నిర్మించిన ఈ రోడ్డు (నిర్మాణంలో) దొరికిన ఓ చెక్కను పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించారు. దానిని రేడియో కార్బన్ అనాలిసిస్ ద్వారా పరిశీలించగా అది దాదాపు ఏడు వేల సంవత్సరాల నాటిదని తేలింది. ఈ వివరాలు క్రొయేషియా వర్సిటీ ఆఫ్ జదర్ పరిశోధకులు ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ప్రపంచంతో పంచుకున్నారు. ఏడు వేల ఏళ్ల క్రితం ఈ రోడ్డుపై ప్రజలు నడిచేవారని వారి పరిశోధనల్లో వెల్లడైంది. నియోలిథిక్ సెటిల్మెంట్‌లో ఈ రహదారి ఓ భాగమని పరిశోధకులు భావిస్తున్నారు. హ్వార్ సంస్కృతిలో నివసించే నైపుణ్యమున్న ఇంజినీర్లు ఈ రహదారిని నిర్మించినట్లు అనుకుంటున్నారు. సముద్ర తీరం వెంబడి, సమీపంలోని ద్వీపాల్లో చిన్న చిన్న సమూహాలుగా అప్పటి ప్రజలు జీవించేవారు. వ్యవసాయం, పశుపోషణ చేస్తూ జీవనం సాగించేవారు.
- తెలియాల్సింది చాలా..
హ్వార్ సంస్కృతి గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది.. కొర్కులా ద్వీపంలోని వెలాలుక సమీపంలో ఉన్న గ్రాండినా బే వద్ద జరిగిన భూ పరిశోధనల్లో భాగంగా సముద్రం అడుగు భాగంలో ఈ అతి పురాతన రోడ్డు మార్గాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సోలిన్ సైట్ వద్ద డైవింగ్ చేస్తున్న సమయంలో అక్కడ ఒక కట్టడాన్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ప్రాంతంలో చెకుముకి బ్లేడ్లు, రాతి గొడ్డళ్లు వంటి నియోలిథిక్ వస్తువులు కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సోలిన్ సైట్‌ను ఇంకా పూర్తిగా తవ్వలేదని, హ్వార్ సంస్కృతి, దాని జీవన విధానం గురించి తెలియాల్సింది ఉంది. దీని గురించిన వాస్తవాలు ఇంకా చాలా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.