
చెన్నై : తమిళనాడులోని ఓ ఆభరణాల రుణ సంస్థలో గతవారం జరిగిన భారీ దోపిడీ కేసులో ఊహించని మలుపు ఎదురైంది. దోపిడీ నగల్లో కొన్ని స్థానిక ఇన్స్‌పెక్టర్ నివాసంలో లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఇన్‌స్పెక్టర్ నివాసం నుండి 3.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెన్నైలోని అరుంబాక్కంలో ఒక బ్రాంచ్ ఉంది. ఆగస్టు 13న మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ బ్రాంచీలోకి కొందరు దుండగులు ప్రవేశించారు. సిబ్బంది, కస్టమర్లను కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేశారు. ఆపై రూ.20కోట్ల విలువైన నగలు, నగదును దోచుకెళ్లారు. ఫెడ్‌బ్యాంకులో పనిచేసే వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా మురుగున్‌ను ప్రధాన నిందితుడిగా అనుమానించారు.
దోపిడీ జరిగిన మరుసటి రోజే సంతోష్, బాలాజీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.8.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు మురుగున్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే విచారణలో నిందితుడు సంతోష్ కీలక సమాచారమిచ్చాడు. తాను దోచుకున్న నగల్లో కొన్నింటిని అచరపాక్కమ్ ఇన్‌స్పెక్టర్ అమల్‌రాజ్ నివాసంలో దాచిపెట్టినట్లు తెలిపాడు. నిందితుడు సంతోష్.. అమల్‌రాజ్ భార్యకు బంధువు కావడం గమనార్హం. గురువారం ఇన్‌స్పెక్టర్ నివాసంలో జరిపిన సోదాల్లో 3.7కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అమల్‌రాజ్, ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ దోపిడీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇన్‌స్పెక్టర్ వెల్లడించడం గమనార్హం. దోపిడీ జరిగిన రోజు రాత్రి సంతోష్ తమ ఇంటికి వచ్చాడని కానీ, అతని వద్ద బంగారం ఉన్నట్లు తెలియదన్నారు.