
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఐక్య పోరాటాలే మార్గమని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 766వ రోజుకు చేరాయి. దీక్షల్లో హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్) కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. హెచ్‌ఎంఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపతి రెడ్డి, దొమ్మేటి అప్పారావు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో శాశ్వత కార్మికులతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు సైతం భుజం భుజం కలిపి పని చేస్తున్నారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌కు ఆపద వస్తే ముందుగా నష్టపోయేది కాంట్రాక్ట్ కార్మికులేనని అన్నారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి కర్మాగారాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు గొడ్డు రమణ, జి.సత్యారావు, ప్రభు కుమార్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.