Jan 25,2023 09:00

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలెదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, దీనికోసం ఐక్య పోరాటాలు నిర్వహించాలని సిపిఎం, సిపిఐ నిర్ణయించాయి. సిపిఎం, సిపిఐ సమావేశం మంగళవారం విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్‌ బాబూరావు, సిపిఐ నుండి రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, జి ఈశ్వరయ్య, కెవివి ప్రసాద్‌ హాజరయ్యారు. ఎపికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు ఈ నెల 25 నుండి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకూ హిందూపురం నుండి ఇచ్ఛాపురం వరకూ చేపట్టిన బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రోడ్‌షోలు, ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరిస్తూ అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన జిఓ నెంబరు 1పై పోరాటం చేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న విశాఖపట్నంలో జరిగే కార్మిక మహాగర్జనకు రెండు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశాయి.