Oct 03,2022 21:28

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు నగరంలోని ప్రభుత్వాస్పత్రి (జిజిహెచ్‌)లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, సమస్యలు పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రూరల్‌ డివైఎఫ్‌ఐ కమిటీ ఆధ్వర్యాన నెల్లూరు నగరంలోని సర్వజన ప్రభుత్వ వైద్యశాల ఎదుట సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు వైద్యశాల సూపరింటెండెంట్‌ను కలిసి సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రముఖమైన విభాగాలకు చెందిన వైద్యనిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లా పరిసర ప్రాంతాల నుంచి అనారోగ్య సమస్యతో వచ్చే వారికి వైద్యులు లేక సరైన వైద్యసేవలు అందడం లేదని, పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రజాధనం ఖర్చు చేసి ప్రభుత్వ వైద్యకళాశాల, దానికి అనుబంధ వైద్యశాల ఏర్పాటు చేశారని, అధునాతనమైన పరికరాలు అమర్చారని తెలిపారు. కానీ వాటిని వినియోగించి రోగులకు సేవలందించేందుకు సరిపడా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వైద్యపరికరాలు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఆసుపత్రికి సరిపడా సిబ్బందిని తక్షణమే నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌ లేకపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో రూరల్‌ కమిటీ కార్యదర్శి కండె కోటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ రూరల్‌ కమిటీ నాయకులు డబ్బుగుంట శ్రీనివాసులు ,దేవతాటి సతీష్‌ ,గోను చైతన్య, తరుణ్‌, డివైఎఫ్‌ఐ కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం రూరల్‌ కమిటీ కార్యదర్శి బత్తల కృష్ణయ్య ఈ ధర్నాకు మద్దతు తెలిపారు.