Nov 22,2022 10:20

మొదటి బిడ్డ ప్రసవంలోనే చనిపోయింది. రెండోబిడ్డ కాన్పు సమయం.. 'ఈసారి అలా జరగకూడదు. పండంటి బిడ్డ పుట్టాలి. నేను అమ్మమ్మ అవ్వాలి' అంటూ బలమైన ఆలోచనతో బంధువులతో పాటు బిడ్డ అమ్మమ్మ వీరమ్మాల్‌ కాన్పు గది బయటే గంటల తరబడి నుంచి వేచి చూస్తోంది.

'పురిటినొప్పులు ఇంకా మొదలవ్వలేదు కదా.. ఎంతసేపు ఉంటావు.. వెళ్లి కాఫీ తాగిరా' అని బంధువులు బలవంతం పెట్టడంతో అటువైపుగా వెళ్లింది. కాఫీ తాగి వచ్చేసరికి ప్రసవం గది బయట బంధువులంతా విషాద వదనాలతో నుంచొని వున్నారు. కారణం రెండో బిడ్డ చేతుల్లేకుండా పుట్టింది. 'ఇంతటి విషాదాన్ని వీరమ్మాల్‌ ఎలా తట్టుకుంటుంది? ఈ బిడ్డ కూడా పురిట్లోనే చనిపోయిందనుకుని ఎక్కడైనా అనాథ శరణాలయంలో ఇచ్చేద్దాం' అంటూ బంధువులంతా ఒక్కమాటపైకి వచ్చారు. అవన్నీ వీరమ్మాల్‌ చెవిన పడ్డాయి. వెంటనే అంతటి విషాదాన్ని దిగమింగుకుంటూనే 'నా మనమరాలిని ఎక్కడికీ పంపించను. నేనున్నంత వరకు నా దగ్గరే ఉంటుంది. నేనే పెంచుతాను' అంటూ గట్టిగా అరిచినట్లు చెప్పింది. ఆ క్షణం అక్కడ జరుగుతున్నదేమిటో.. తనకేమైందో తెలియని ఇంకా కళ్లుతెరవని ఆ పసిగుడ్డుపై వీరమ్మాల్‌ వెచ్చని కన్నీటి బిందువులు ధారాళంగా పడుతున్నాయి. ఇదంతా జరిగి 30 ఏళ్లు.

తమిళనాడు విల్లుపురంలో అర్కడు ఓ చిన్న గ్రామం. అక్కడే నివసిస్తోంది వీరమ్మాల్‌ కుటుంబం. చేతుల్లేకుండా పుట్టిందని బంధువులంతా వదిలేయమన్న కూతురి బిడ్డ పెంపకం బాధ్యతను తనే తీసుకుంది. విద్యాధరిగా పేరు పెట్టింది. అయితే పిల్ల ఎదుగుతున్న కొద్దీ 'పేరులోనే విద్య ఉంది కాని చదువు చెప్పించగలనా లేదా' అని ఎంతో మదనపడేది. ఆమె భయపడినట్లుగానే ఇలాంటి పిల్లను స్కూల్లో చేర్పించుకోబోమన్నారు. ఇంటి దగ్గర మీరు అన్నీ చూసుకుంటారు. మా బడిలో సౌకర్యాలేమీ లేవు. సాధ్యంకాదని తిప్పి పంపించేశారు. ఎలాగోలా బతిమిలాడి స్కూల్లో చేర్చిందే కాని కాలేజీకి వచ్చేసరికి సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఏం చేయాలో తోచని వీరమ్మాల్‌ రోజంతా కన్నీరుమున్నీరుగా ఏడుస్తూనే ఉండేది. చిన్నప్పటి నుంచి మనుమరాలి పట్ల వీరమ్మాల్‌ చూపిస్తున్న ప్రేమ, శ్రద్ద తెలిసిన ఊరు ఇప్పుడు ఆమెకు అండగా నిలిచింది. కాలేజీ వాళ్లతో మాట్లాడి విద్యాధరిని చేర్పించారు. 'అమ్మమ్మ వాత్యల్యంలో నాకు రెండు చేతులు లేవని ఎప్పుడూ మదనపడేదాన్ని కాదు. స్కూల్లో గాని, కాలేజీలో గాని నోట్సు, పరీక్షలు రాయడంలో ఎవరి మీదా ఆధారపడలేదు. చేతులతో చేసే పనులన్నీ కాళ్లతోనే చేసుకుంటాను. అందరిలా నాకు చేతుల్లేవని ఎప్పుడూ బాధపడలేదు. నా బాధ అంతా మా అమ్మమ్మే పడింది' అంటుంది విద్యాధరి. 'మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. నా పాప మాత్రం ఉన్నత విద్య చదివింది. ఆశ్రమంలో వదిలేయమన్న వారంతా ఇప్పుడు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. నాకిప్పుడు ఎంతో గర్వంగా ఉంది' అంటూ విద్యాధరిని తదేకంగా చూస్తూ మురిసిపోతోంది వీరమ్మాల్‌. కుటుంబానికి ఆసరాగా నిలబడి, చదువంటే తెలియని కుటుంబంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్‌గా నిలిచిన తన గారాలపట్టిని చూస్తూ మూడు దశాబ్దాలుగా తను పడిన కష్టాన్ని, దు:ఖాన్ని మరిచిపోతోంది. ఇంటి చుట్టుపక్కల స్కూలు పిల్లలకు ట్యూషన్‌ చెబుతోన్న విద్యాధరి గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. భవిష్యత్తులో లెక్చరర్‌గా రాణించాలని కలలుగంటోంది. ఆమె ఆశ నెరవేరాలని మనమూ కోరుకుందాం.