Jul 01,2022 20:13

- పెంచిన ఫీజును రద్దు చేయాలని ఆరుగంటల పాటు కళాశాల వద్ద బైఠాయింపు
- ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టు - విడుదల
ప్రజాశక్తి-విజయనగరంకోట : 
పెంచిన ఫీజులను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరంలోని మహారాజా డిగ్రీ కళాశాల విద్యార్ధులు శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌ను కలిసేందుకు అనుమతివ్వకపోవడంతో ఆయన రూం వద్దే బైఠాయించారు. దీంతో యాజమాన్యం పోలీసులను మోహరించింది. కళాశాల నుంచి విద్యార్ధులను బయటకు పంపేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జోరు వానలోనూ విద్యార్ధులు తమ ఆందోళనను గేటు బయట కొనసాగించారు. ఉదయం పదిగంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకూ ఆందోళన చేపట్టారు. చివరకు ప్రిన్సిపాల్‌ సాంబశివరావు బయటకు వచ్చి విద్యార్ధులతో మాట్లాడారు. ఫీజులపై రెండు నెలల్లో సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యాదీవెన రాకపోయినా ఫీజు చెల్లించమని ఒత్తిడి చేయబోమని తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బి.లక్ష్మణ్‌, కళాశాల విద్యార్థి వెంకటరమణను సాయంకాలం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, సహాయ కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌,డి.రాము మాట్లాడారు. రూ. మూడు వేల ఫీజుతో కళాశాలలో చేరిన విద్యార్ధుల నుంచి అక్రమంగా రూ.15వేలు కట్టించుకోవడం దుర్మార్గమన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పలుమార్లు ప్రిన్సిపల్‌కు వినతిపత్రం ఇచ్చినా ఫీజు కట్టాల్సిందేనని ఒత్తిడి చేశారని తెలిపారు. కళాశాలను తిరిగి ఎయిడెడ్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.