Oct 02,2022 21:24

- అదానీ వ్యాపారం కోసం విదేశీ బగ్గు కొనుగోలు
- కార్పొరేట్లకు వరాలుగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలాలు
- ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి :
విశాఖ ఉక్కును అదానీకి హక్కుగా బిజెపి ప్రభుత్వం చేసేస్తోందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ విమర్శించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకుల ఆత్మీయ అభినందన సభను గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన ఆదివారం శ్రీకాకుళంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 200 ఏళ్లకు సరిపడా బొగ్గు గనులున్నా విదేశాల నుంచి పది శాతం బగ్గు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఆస్ట్రేలియాలో బొగ్గు గనులున్న అదానీ వ్యాపారం కోసమేనని తెలిపారు. మోడీ విధానాలతో విదేశీ వలస విధానంవైపు దేశం అడుగులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్న కార్పొరేట్లకు రూ.9 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ సమైక్యతను దెబ్బతీస్తోందని విమర్శించారు. కాశ్మీర్‌ను మూడు ముక్కలు చేసి రాష్ట్ర హోదా తీసేసిందని, రాబోయే రోజుల్లో ఎపిని మూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్ర హోదా తీసేసినా ఆశ్చర్యంలేదన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలాలు కార్పొరేట్లకు వరాలుగా మారాయని పేర్కొన్నారు. జాతీయోద్యమ లక్ష్యం, దాని ప్రయోజనాలను రాబోయే తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల సమస్యల పరిష్కారానికి సమరయోధుల గౌరవ యాత్ర చేపట్టాలని సూచించారు.
సభాధ్యక్షులు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రానికి, దాని ద్వారా ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగానికి బిజెపి పాలనలో తీవ్ర విఘాతం కలుగుతోందని తెలిపారు. అంతకుముందు గరిమెళ్ల, మహాత్మాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 60 మంది సమరయోధుల కుటుంబాలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో గరిమెళ్ల సత్యనారాయణ మనువడు అశోక్‌ లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యే కె.ఎ.ఎన్‌.భుక్త, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎం.ప్రభాకరరావు, కోశాధికారి సుధాకరరావు పాల్గొన్నారు.