
ప్రజాశక్తి-ఉక్కునగరం, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 768వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ సిఒసిసిపి విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని, దీనికోసం ప్రత్యేకంగా కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటాలకు కార్మికులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఒసిసిపి విభాగ ఉద్యోగులు మొహిద్దిన్, వరసాల శ్రీనివాసరావు, విల్లా రామ్మోహనరావు, టివికె.రాజు, పి.శ్రీను, రామ్‌శేఖర్, తదితరులు పాల్గొన్నారు.