Sep 30,2022 21:44

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో :దేశంలోనే విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు షిప్‌ బిల్డింగ్‌ హబ్‌గా మారనుందని సంస్థ చైౖర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ ఖత్రీ తెలిపారు. నౌకలు, సబ్‌మెరైన్‌ల తయారీ, మరమ్మతులలో గతంలో ఎన్నడూ లేనంతగా 2021ా22లో విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) రూ.755 కోట్ల టర్నోవర్‌తో ప్రగతిపథంలో పయనించిందని పేర్కొన్నారు. విశాఖపట్నం షిప్‌యార్డులో శుక్రవారం నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 2023 నాటికి రూ.వెయ్యి కోట్లు, 2024 నాటికి రూ.1500 కోట్లు టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రెండు డైవింగ్‌ సపోర్టు వెసెల్స్‌ నిస్సార్‌, నిపుణ్‌లను రూ.2200 కోట్లతో నిర్మించి ఇండియన్‌ నేవీకి అప్పగించామన్నారు. షిప్‌యార్డుకు అత్యంత కీలకమైన, ఆర్థిక ప్రగతికి తోడ్పడే ఐదు ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)లకు కేంద్రం క్లియరెన్స్‌ ఇస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని, ఈ ఆర్డర్‌ దక్కితే వేల కోట్ల రూపాయలు షిప్‌యార్డు టర్నోవర్‌ పెరిగేందుకు దోహదపడుతుందని అన్నారు. షిప్‌యార్డుకు షిప్‌ బిల్డింగ్‌, మరమ్మతులలో ప్రపంచ స్థాయి సాంకేతిక అర్హతలున్నాయని తెలిపారు. త్వరలో కేంద్ర కేబినెట్‌ ఆమోదించి ఎఫ్‌ఎస్‌ఎస్‌లపై ఆర్డర్లను ప్రకటిస్తే హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు గుడ్‌న్యూస్‌ అవుతోందన్నారు. సంస్థలో ఎల్‌అండ్‌ఎం సిరీస్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ విషయంలో నిబంధనలు వర్తించడం లేదన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.