Jun 24,2022 07:44

నర్సీపట్నం అర్బన్‌ : మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ఐటి చట్టంతో సహా పలు సెక్షన్లతో కేసు నమోదయినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా నకరికల్లు పోలీసులు గతంలో నమోదు చేసిన ఓ కేసుకు సంబంధించి 41ఎ నోటీసు ఇచ్చేందుకు నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటికి గురువారం రాత్రి విశాఖ త్రీటౌన్‌ పోలీసులిద్దరు వెళ్లారు. ఆ సమయంలో అయ్యన్న లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.

టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజరును కలిసిన త్రీటౌన్‌ పోలీసులు తాము అయ్యన్నకు నోటీసు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. అయ్యన్న ఇంట్లో లేరని, నోటీసు తనకు ఇచ్చినా లేదా ఇంటికి అతికించినా అభ్యంతరం లేదని విజరు వారికి తెలిపారు. కేసు వివరాలను అడిగినప్పటికీ వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తాము మళ్లీ వస్తామని వెళ్లిపోయారు. త్రీటౌన్‌ పోలీసులు క్రైం నంబరు 317 ప్రకారం సెక్షన్‌ 153, 153ఎ, 504, 505, సెక్షన్‌ 67 ఐటీ చట్టం ప్రకారం అయ్యన్నపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.