
ప్రజాశక్తి - కడప అర్బన్ : సిపి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులుగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కడపలోని బ్రౌన్ గ్రంథాలయానికి చేసిన సేవలు నిరుపమానమని యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య అన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డితో కలిసి వారు బుధవారం విశ్వనాథరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్సిటీ విసి మాట్లాడుతూ కేతు విశ్వనాథరెడ్డి కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులని పేర్కొన్నారు. మొదటి నుంచి తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించి శాస్త్రీయ దృక్ఫథంతో మానవ సంబంధాలను విశ్లేషించి రచనలు చేశారని తెలిపారు. సామాన్యుల జీవితాల్లో సంభవించే అన్ని కోణాలను తనదైన మార్క్సిస్టు దృక్పథంతో ఆవిష్కరించారని తెలిపారు. ఆయన వ్యాసాలు, నాటకాలు, నాటికలు రాసినా తెలుగు సాహిత్యలోకంలో కథకునిగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు. అధ్యాపకుడిగా, పరిశోధనకుడిగా, పాత్రికేయుడిగా, బహుశాస్త్రవేత్తగా, కథకుడిగా, విమర్శకుడిగా అనేక ప్రక్రియల్లో ఆయన గణనీయమైన కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకష్ణ శాస్త్రి, డాక్టర్ చింతకుంట శివారెడ్డి, గ్రంథపాలకులు ఎన్.రమేశ్‌రావు, జి.హరిభూషణరావు, పాల్గొన్నారు.