Aug 09,2022 07:15

పిల్లలూ! చేప అంటే నీటిలో ఈది తీరాలి కానీ నడిచే చేపలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ! మరి ఈ రోజు ఆ చేపల విశేషాలు తెలుసుకుందామా !
సముద్రం అట్టడుగు మట్టంలో జీవించే 'హాండ్‌ ఫిష్‌లు' ఈదలేవు. చేతులతో నడుస్తాయి. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు చిన్న చిన్న చేతుల్లాగా పొడుచుకు వచ్చి ఉంటాయి. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఈదటం రాక నీటి అడుగున ఉండే క్రస్టసీన్‌లు, చిన్నచిన్న జీవులు తింటూ అక్కడే జీవిస్తాయి. అందుకే దీనికి 'హాండ్‌ ఫిష్‌' అని పేరొచ్చింది. నాలుగు అంగుళాలు పొడవుండి బంగారు, నలుపు వర్ణంలో భలే అందంగా కనిపిస్తుంది. వీటిలో మొత్తం 14 జాతులున్నాయి. ముప్పు పొంచి ఉన్న జీవుల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి.
ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్‌ఫిష్‌లు కూడా ఉన్నాయి. అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగు సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాలాలంటి మొప్పలు ఉన్నాయి.