
- జాబ్‌కార్డులకు నోచుకోని యానాదులు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రెక్కాడితే డొక్కాడని నిరుపేద కుటుంబాలు. గుడారాలే వారికి ఆవాసాలు. కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు ఆ యానాదులు. తిరుపతికి కూతవేటు దూరాన రామాపురంలో ఉన్న డంపింగ్ యార్డులో ఏరుకున్న ప్లాస్టిక్ డబ్బాలు, ఇనుప రేకులు, కాగితాలు, అట్టపెట్టెలే వీరికి జీవనాధారం. కుటుంబాలకు కుటుంబాలు ఇదే పనిలో ఉంటున్నాయి. చెత్త లారీ రాగానే పొలోమని వచ్చి ఆ చెత్తను కలబెట్టేస్తారు. వారికి కావాల్సినవి దొరుకుతాయేమోనని వెతుక్కుంటారు. దొరికిన ప్లాస్టిక్, ఇనుప సామాన్లు, అట్టపెట్టెలు అన్నీ సాయంత్రం 'గుజురీ' సామాన్ల అంగడిలో అమ్ముతారు. కుటుంబమంతా కష్టపడితే ఆ రోజుకు రూ.200 నుంచి రూ.300 ఆదాయం వస్తోది. 'ఉపాధి హామీ చట్టం' అమలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన 'యానాదుల' కథనం ఇది.
రామచంద్రాపురం మండలానికి సమీపంలో రామాపురం డంపింగ్ యార్డు ఉంది. తిరుపతిలో నగరంలో పోగేసిన వ్యర్థాలను కార్పొరేషన్ ఆధ్వర్యాన పారిశుధ్య కార్మికులు రోజుకు 30 లారీల్లో డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. చుట్టుపక్కలవారి నుంచి అభ్యంతరాలు ఎదురైనా 2006లో ఇక్కడ డంపింగ్ యార్డును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ యార్డుకు సమీపంలో ఉన్న యానాదులు పనులు లేక 15 ఏళ్ల క్రితం నుంచీ డంపింగ్ యార్డును నమ్ముకుని బతుకుతున్నారు. చెత్తలో వ్యర్థాలను వెతుక్కుని అమ్మి జీవనం సాగిస్తున్నారు. 50 యానాది కుటుంబాలు గుడారాలు వేసుకుని అక్కడికి సమీపంలోనే ఉంటున్నాయి. ఒక్కో గుడారంలో దాదాపు ఆరేడుమంది జీవనం సాగిస్తున్నారు. వీరికి కనీసం వీధి దీపాలు కూడా లేవు. అంథకారంలోనే 'చెత్త'ను నమ్ముకుని బతుకులీడుస్తున్నారు. వీరికి ఆధార్, రేషన్ కార్డులు ఉన్నాయి. తమకు ఉపాధి హామీ చట్టం కింద పని కల్పించాలని రామచంద్రాపురం అధికారుల చుట్టూ తిరిగితిరిగి అలిసిపోయారు. ఈ యార్డు పక్కనే ఉపాధి హామీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రామాపురం, పిల్లపాళ్యం, జగనన్న కాలనీ, గొల్లపల్లి, రామచంద్రాపురం గ్రామాల వారికి 2100 జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ వెయ్యి మంది ఉపాధి పనులు చేస్తున్నారు. యానాదులకు జాబ్‌కార్డులు ఇవ్వకపోవడంతో ఉపాధి పనులకు అధికారులు పిలవడం లేదు. ఈ యార్డుకు సమీపంలో జగనన్న కాలనీ మూడు వేల మందితో ఉంది. ఆ కాలనీలో వీరికి చోటు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కాళ్లరిగేలా జాబ్ కార్డుల కోసం తిరిగాం
పదో తరగతి వరకూ చదువుకున్నాను. పనులు దొరక్కపోవడంతో తిరుపతి రూరల్ మండలం పాడిపేటలోని గోవిందవరం నుంచి పదేళ్ల క్రితం డంపింగ్ యార్డు వద్దకు వలసొచ్చాం. చెత్తలో మాకు అవసరమైన వ్యర్థాలను సేకరించి వాటిని అమ్ముకుని బతుకుతున్నాం. జాబ్‌కార్డు కావాలని కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగాం. ఎవరూ మా మొర ఆలకించలేదు. మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయి. కుటుంబమంతా కష్టపడితే రోజుకు రూ.250 మాత్రమే వస్తోంది.
- రాజా, నిరుద్యోగి

త్వరలోనే ఆ ప్రాంతానికి వెళతాం
గతంలో ఓసారి వెళ్లి ఉపాధి పనులకు పిలిచాం. ఎవరూ స్పందించలేదు. ముగ్గురు మాత్రం దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ ఏమయ్యిందో తెలియదు. ఉపాధి హామీ ఫీల్డ్ స్టాఫ్‌ని త్వరలోనే ఆ ప్రాంతానికి పంపి యానాదులకు జాబ్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
- హంసవేణి, ఎపిఒ, రామచంద్రాపురం