Aug 06,2022 12:37

న్యూఢిల్లీ : తెలుగు చిత్రాల్లో.. ఓల్డ్‌ మూవీస్‌లో నిల్చున్నచోటే భూమి కంపించడం, చీలిపోవడం వంటి కొన్ని సీన్లుంటాయి. అలాంటి సన్నివేశాల్ని అందరూ ఆసక్తిగా చూస్తారు. సరిగ్గా అలాంటి సీనే.. నిజ జీవితంలోనూ జరిగితే షాకవ్వడం మనవంతవుతుంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్ర తాజాగా ఆసక్తికరమైన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి.. రోడ్డుపక్కనున్న షాపువైపు వెళ్లడానికి నడుచుకుంటూ వెళతాడు. రోడ్డుదాటి షాప్‌వైపు వెళ్లడానికి నడుస్తూ ఆ వ్యక్తి అడుగు తీసి అడుగు వేసేలోపే సైడ్‌వాక్‌ కూలిపోతుంది. రెప్పపాటులో అతను ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు. అయితే రోడ్డు అలా కూలిపోవడంతో.. ఆ వ్యక్తి షాకవతాడు. ఇంతలోనే.. ఆ షాపులోని వ్యక్తులు బయటికి వస్తారు. ఈ వీడియోను చూసినెవరైనా సరే.. అతనిని అదృష్టవంతుడు అనుకుండా ఉండలేరు. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఆనంద్‌మహీంద్ర 'ఆ వ్యక్తి మీరే అయితే ఏం చేస్తారు' అని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు తొమ్మిదిన్నర లక్షల మందికిపైగా వీక్షించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి క్షణకాలంలోనే పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అని ఓ నెటిజన్‌ వ్యాఖానించారు. మరొక నెటిజన్‌.. మౌలిక సదుపాయాల్ని కల్పించమని పౌరులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అని కామెంట్‌ చేశారు.