Mar 22,2023 07:37

నీటి వనరులు తరగనివి కావు. విచ్చలవిడి వాడకంతో అవి అంతర్ధానం అయ్యే ప్రమాదం వుంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడి, సంరక్షించుకోవాలి. దీనిని రెండు రకాలుగా కాపాడుకోవచ్చు. మొదటిది నీటి పొదుపు, సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించటం ద్వారా. రెండవది ఆ రకమైన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాలకు నివేదించటం ద్వారా. అందుకుగాను ప్రజలు ప్రభుత్వాలకు తమ డిమాండ్లను తెలపాలి.

మా నవ మనుగడకు నీరు ముఖ్యమైన ఆధారం. నీరు లేనిదే మానవ మనుగడే కాదు...భూమిపై జీవరాశుల మనుగడే దుర్లభం. అందుకే నీరు ప్రాణాధారం అని చెప్పుకోవచ్చు. దేశంలో అనేక రాష్ట్రాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నీటి కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడటం కూడా చూస్తున్నాం. భూమిపై లభించే నీటిలో 97 శాతం ఉప్పు నీరే. 3 శాతం మాత్రమే మంచి నీరు. దీనిలో 2 శాతం మంచుగడ్డల రూపంలో వుంటే మిగతా 1 శాతం నీరు మాత్రమే మానవులు, జీవకోటి ఉపయోగించు కోవడానికి అనువుగా వుంది. దీనిలో భారతదేశానికి లభించే నీరు 0.04 శాతం మాత్రమే. ప్రపంచ జనాభాలో 17.4 శాతంగా నున్న మన దేశ జనాభాకు ఈ నీరు చాలా తక్కువనే చెప్పాలి.
          అత్యధిక జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, పట్టణ నగరాల పెరుగుదల, అడవుల నరికివేత, చిత్తడి నేలల నదుల విధ్వంసం, వాతావరణ మార్పులు, సక్రమ నీటి యాజమాన్యం లేకపోవటం తీవ్ర నీటి ఎద్దడికి ముఖ్య కారణాలు. దీనికి తోడు ఉన్న నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయి. కేవలం లాభాపేక్షతో ప్రజా ప్రయోజనం లేని, విదేశీ శీతల పానీయాల కంపెనీలను దేశానికి రప్పించడంలో కేంద్రంలోని ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. ఫలితంగా నీటి వనరుల విచ్చలవిడి వాడకం పెరిగింది. అంతటితో ఆగక నీటి వ్యాపారం ఆరంభమయ్యింది. ఒకప్పుడు సురక్షిత తాగునీటిని స్థానిక సంస్థలు బాధ్యతగా ప్రజలకు అందించేవి. కార్పొరేట్ల వ్యాపారానికి వీలుగా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు సురక్షిత తాగునీటి సరఫరా నుండి వైదొలగేలా చేశాయి. దీనికి తోడు నీటి వనరులను కలుషితం చేసే, వ్యవసాయానికి, పర్యావరణానికి చేటు చేసే ఆక్వా సాగును మంచి నీటి ప్రాంతాలలో ప్రభుత్వాలు పోటీ పడి ప్రోత్సహిస్తున్నాయి.
         భూగర్భ జలాల పెంపుదలకు ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. అయినప్పటికీ భూగర్భ జలాలను విపరీతంగా వాడడం వలన నానాటికీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోతున్నాయి. ఈ విపరీతమైన భూగర్భ జలాల వాడకానికి విదేశీ శీతల పానీయాల తయారీ ఫ్యాక్టరీలు ఒక కారణంగా చెప్పొచ్చు. దీనితో స్థానికంగా భూగర్భ జలాలు తగ్గిపోవడం, నీటి ఎద్దడి ఏర్పడడం చూస్తున్నాం. కోటానుకోట్ల ప్రజలకు, లెక్కలేనన్ని పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, పొలాలు, కర్మాగారాలకు అవసరమైన సురక్షితమైన నీరు లేదు. వారికి అవసరమైన మరుగుదొడ్లు లేవు.
      నీటి ప్రాముఖ్యతకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 22న ''ప్రపంచ జల దినోత్సవాన్ని (వరల్డ్‌ వాటర్‌ డే)'' అంతర్జాతీయంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి 1992లో నిర్దేశించింది. 1993 నుండి ఈ రోజును జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి దీనికి ఒక థీమ్‌ను నిర్దేశిస్తున్నది. మార్పును వేగవంతం చేయాలన్నది ఈ ఏటి థీమ్‌. నీటి సంరక్షణ, నీటి వనరుల నిర్వహణ విషయంలో మనం చేపట్టాల్సిన విధానాలలో తీసుకు రావాల్సిన మార్పును వేగవంతం చేయాలి. నీరు మనందరినీ ప్రభావితం చేస్తుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ ఐక్య కార్యాచరణకు పూనుకోవాలి. మీరు, మీ కుటుంబం, పాఠశాల, సంఘం నీటిని ఉపయోగించే, వినియోగించే, నిర్వహించే విధానాన్ని మార్చడం ద్వారా నీటిని కాపాడుకోవచ్చు. మార్పును వేగవంతం చేయడానికి, మనకు మరింత కార్యాచరణ అవసరం. ఐక్యరాజ్యసమితి ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక, ఐక్యరాజ్యసమితి 2023 వాటర్‌ కాన్ఫరెన్స్‌, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నుంచి కార్యాచరణను రూపొందించుకోవాలి.
       తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జన విజ్ఞాన వేదిక ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రజలలో, విద్యా సంస్థలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. నీటి వనరులు తరగనివి కావు. విచ్చలవిడి వాడకంతో అవి అంతర్ధానం అయ్యే ప్రమాదం వుంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడి, సంరక్షించుకోవాలి. దీనిని రెండు రకాలుగా కాపాడుకోవచ్చు. మొదటిది నీటిపొదుపు, సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించటం ద్వారా. రెండవది ఆ రకమైన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాలకు నివేదించటం ద్వారా. అందుకుగాను ప్రజలు ప్రభుత్వాలకు తమ డిమాండ్లను తెలపాలి.
 

                                                          తీసుకోవాల్సిన చర్యలు

మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకోవడం. సముద్ర నీటిని డిసాలినేషన్‌ చేసి వాడుకోవటం. రిజర్వాయర్లలో పూడికలు తొలగించటం. అడవులు, నదులను సంరక్షించడం. కట్టడాలకు నది ఇసుకను నియంత్రించి రాతి ఇసుకను వాడటం. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం. సెప్టిక్‌ ట్యాంకుల వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయటం. మంచినీటి చేపల చెరువులను నిషేధించటం. చిరుధాన్యాల, మెట్ట పంటలను ప్రోత్సహించటం. వరి - చెరకు - అరటి - జనుము తదితర పంటలకు నీటి వాడకాన్ని తగ్గించే పద్ధతులను సత్వరమే పరిశోధించి అమలు పరచటం. నీటిని అత్యంత పొదుపుగా వాడటం. ఇళ్లు - ఆఫీసు ఆవరణాలలో పూల మొక్కలు, పచ్చిక పరిమితంగా పెంచటం. సముద్రతీర ప్రాంతమంతా వ్యాపించిన నీటితో సమృద్ధిగా వుండే ఇసుక, ఇసుక - మట్టితో కూడిన భూములను రక్షించటం. కొల్లేరు, ఇతర సరస్సులు, చిత్తడి నేలలను రక్షించటం. జనాభా పెరుగుదలను నియంత్రించటం. భవనాలు కొన్ని తరాల పాటు మన్నేట్లు నిర్మాణ నాణ్యతను పెంచటం. గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించటం వంటి చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి. అంతేగాక విద్యార్థులకు విద్యాసంస్థల దగ్గర, ప్రజలకు నీటి వనరుల దగ్గర అవగాహనా కార్యక్రమాలను రూపొందించాలి.

(వ్యాసకర్త రాష్ట్ర పర్యావరణ కమిటీ కన్వీనర్‌, జెవివి. సెల్‌ : 8500004953)
(నేడు ప్రపంచ జల దినోత్సవం)
కె.వి.వి. సత్యనారాయణ

కె.వి.వి. సత్యనారాయణ