Jun 22,2022 21:23

95వేలకు పైగా కేసులు నమోదు
పారిస్‌ : 
కోవిడ్‌ కొత్త వేరియంట్లతో ఫ్రాన్స్‌లో తాజాగా కొత్త వేవ్‌ ప్రారంభమైందని వ్యాక్సినేషన్‌ చీఫ్‌ అలెన్‌ ఫిషర్‌ బుధవారం చెప్పారు. దాదాపు రెండు నెలల్లో గరిష్టానికి రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు 95వేలకు పైగా కేసులు వచ్చాయి. దేశంలో మళ్ళీ కరోనా పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన టివి ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభుత్వ రవాణాలో ప్రయాణిస్తున్నపుడు ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరి చేయడానికి తాను సుముఖంగా వున్నానని చెప్పారు. అయితే ఈ కొత్త వేవ్‌ ఎంత తీవ్రతతో వుండబోతుందనేది ఇప్పుడు ప్రశ్న అని అన్నారు. పోర్చుగల్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా తలెత్తిన ఒమిక్రాన్‌ వేరియంట్లు బిఎ.4, బిఎ.5ల వల్లే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని యురోపియన్‌ అంటువ్యాధుల నివారణా కేంద్రం (ఇసిడిసి) పేర్కొంది. అయితే ఈ వేరియంట్ల వల్ల ఒమిక్రాన్‌ ఇతర వేరియంట్ల మాదిరిగా తీవ్ర ముప్పు వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. ఫ్రాన్స్‌లో మే చివరి నాటికి కొత్త ఇన్ఫెక్షన్లు నెమ్మదిగానే అయినా పెరుగుతునే వచ్చాయి. మే 27న 17,705 కేసులు వుండగా, జూన్‌ 21నాటికి 50,402 కేసులు నమోదయ్యాయి.