Oct 01,2022 20:17

ప్రజాశక్తి - కడప అర్బన్‌ :స్వాతంత్య్ర పోరాటంలో జాతిని ఏకం చేసి పోరాడిన మహాత్మా గాంధీ పోరాట స్పూర్తితో కడప ఉక్కును సాధించుకుందామని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు అన్నారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యాన కడపలోని బాలాజీ నగర్‌లో శనివారం సదస్సు నిర్వహించారు. సదస్సులో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు వీరనాల శివకుమార్‌, సగిలి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోందని తెలిపారు. అంబాని, ఆదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారని విమర్వించారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోందని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని చెప్పారు. గాంధీజీ నాడు జాతి సమైక్యత కోసం మత సామరస్యాన్ని పాటించారని, నేడు బిజెపి పాలకులు దానిని పూర్తిగా విస్మరించారని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.