Jul 05,2022 22:15
  • పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువే
  • 8వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్‌లో ట్యాబ్‌లు
  • మెరుగైన ఫలితాల కోసమే బైజూస్‌తో ఒప్పందం

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : మంచి చదువుతోనే పిల్లలు పేదరికాన్ని జయించగలుగుతారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగనోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం నిర్వహించిన మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనన్నారు. విద్యా రంగంలో తొమ్మిది ప్రధాన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బైజూస్‌తో ఒప్పందం చేసుకుని విద్య సులువుగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న 4.70 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేలు విలువైన ట్యాబ్‌లను సెప్టెంబర్‌లో అందిస్తామని తెలిపారు. వాటిని బైజూస్‌తో అనుసంధానం చేస్తామన్నారు. 2025లో సిబిఎస్‌ఇ పరీక్షలు రాస్తే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఈ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. రేపటి తరం భవిష్యత్తుపై దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు పేదలకు నవరత్నాల ద్వారా ఒకవైపు మంచి చేస్తున్నామని, మరోవైపు పిల్లలు చదువుకునేందుకు కావలసిన వాతావరణం కల్పిస్తున్నామని అన్నారు. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభం అయితే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడేవారని, ఆ పరిస్థితి లేకుండా విద్యా కానుక అందిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడు లక్షలు పెరిగింది
రాష్ట్రంలో డ్రాపౌట్స్‌ తగ్గాయని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏడు లక్షలు పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యార్థుల భోజనానికి రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, తాము ఏడాదికి రూ.1,850 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. పౌష్టికాహారానికి గత ప్రభుత్వం రూ.500 కోట్లు కూడా పెట్టలేదని, తాము రూ.1,950 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తొలి ఏడాది విద్యా కానుక కిట్టుకు రూ.1,530 ఖర్చు పెడితే, ఇప్పుడు రూ.1,964 ఖర్చు చేస్తున్నామని, ఖర్చు పెరిగినా ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. అనంతరం ఈ ఏడాది 47 లక్షల మందికి రూ.931 కోట్లతో ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అకడమిక్‌ కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి బత్స సత్యనారాయణ, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపి సంజీవ్‌ కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గన్నారు.

  • విద్యార్థులతో ముచ్చటించిన సిఎం

తొలుత ఓర్వకల్లు విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఆదోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నెహ్రూ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు చేరుకుని పాఠశాలను సందర్శించారు. పాఠ్యపుస్తకాలను పరిశీలించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులతో కలిపి గ్రూప్‌ ఫొటో దిగారు. విద్యార్థులను అందజేయనున్న విద్యా కానుక కిట్లను పరిశీలించారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకుని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. సభలో ప్రసగించిన అనంతరం విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు.