
విజయవాడ : నేడు గుంటూరు బాపనయ్య 45వ వర్థంతి సందర్భంగా ... '' సామాజిక న్యాయం - వ్యవసాయ కార్మికులు '' అనే అంశంపై ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం విజయవాడలో సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రసంగిస్తూ ...
తాను విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఓ మహాసభలో సుందరయ్య మాట్లాడుతూ... గుంటూరు బాపనయ్య పోరాటం గురించి వివరించడం విన్నానన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఎలాంటి ఉద్యమాలు జరిగినా బాపనయ్య స్ఫూర్తిని స్మరించుకుంటూనే ఉంటున్నామన్నారు. చల్లపల్లి జమిందారుపై వ్యతిరేక పోరాటంలో తీవ్ర నిర్బంధం కొనసాగిందని, చల్లపల్లి సంస్థానంలో రైతులపై, కూలీలపై, దళితులపై, పేదవర్గాలపై, మహిళలపై దాష్టీకం పెరిగిపోయిందన్నారు. బానిస వ్యవస్థలా కొనసాగిన చల్లపల్లి హయాంలో దాన్ని వ్యతిరేకిస్తూ చల్లపల్లి నారాయణరావు, చంద్రరాజేశ్వరరావు ప్రత్యక్ష నాయకత్వంలో పోరాటం జరిగిందన్నారు. ఆ పోరాటాల ఫలితంగా జమిందారీ వ్యవస్థే రద్దయిందని తెలిపారు. ఇప్పటికీ చల్లపల్లి జమిందారు పరిధిలో లాక్కున్న భూములపై అసలు హక్కుదారులకు ఎలాంటి హక్కులూ లేకుండాపోయాయన్నారు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుపోయి ఉన్నాయని తెలిపారు. జమిందారు విధానం రద్దయినప్పటి నుండి ఈనాటి వరకూ పేదల భూముల కోసం పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అప్పటి నుండి కొనసాగిన చారిత్రాత్మకమైన పోరాటానికి గుంటూరు బాపనయ్య కీలక నాయకత్వ పాత్ర పోషించారని వివరించారు. బాపనయ్య విద్యార్థి దశ నుండే సామాజిక సమస్యలను పరిశీలించి కమ్యూనిస్టుగా మారి సామాజికాంశాలలో చొరవగా ప్రజలందరితో మమేకమైన నాయకుడిగా గుర్తింపు, ప్రజల అభిమానాన్ని పొందారన్నారు. 3సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఆదర్శప్రాయులయ్యారని అన్నారు. రాజకీయవేత్త ఎలా ఉండాలో అందుకు నిదర్శనం గుంటూరు బాపనయ్య అని కొనియాడారు. స్వలాభాన్ని ఆశించక పదవిని ప్రజల కోసం వినియోగించిన ఆదర్శప్రాయులని అన్నారు. వ్యవసాయ కార్మికుల విముక్తి కోసం, భూ సమస్య పరిష్కారం కోసం బాపనయ్య పోరాడారని తెలిపారు. వేతన బానిసలుగా ఉండకూడదనీ, వారు పూర్తి స్వతంత్ర స్వేచ్ఛాజీవులుగా ఉండాలని అనే ఆశయాలతో బాపనయ్య పోరాటం చేశారని చెప్పారు. కానీ ప్రస్తుతం స్వార్థపూరిత రాజకీయాలే కొనసాగుతున్నాయని విమర్శించారు. బాపనయ్య స్ఫూర్తితో కమ్యూనిస్టులంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తమ అస్తిత్వం కోసం ప్రజలంతా పోరాడేలా వారిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలని వి.శ్రీనివాసరావు కోరారు.