
- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : పోరాటాలతో మోడీ ప్రభుత్వం మెడలు వంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 712వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ విభాగం కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, నాయకులు వరసాల శ్రీనివాసరావు, విల్లా రామ్మోహన్ కుమార్, యు.రామస్వామి, ఎన్.రామారావు సిహెచ్.సన్యాసిరావు మాట్లాడారు. బిజెపికి చట్టసభల్లో బలం ఉందని ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తుండడం దారుణమన్నారు. దుందుడుకుగా ముందుకు వెళ్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు నగరంలోని తృష్ణా మైదానంలో ఈ నెల 30న జరిగే ఉక్కు ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలని కోరారు. ఉక్కు సెగ ఢిల్లీకి తగిలేలా ఈ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, ప్రజా సంఘాలు ఈ సభకు మద్దతు తెలిపాయన్నారు. కార్యక్రమంలో ఆర్.వెంకట్రావు, శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు.