Sep 22,2022 20:17

- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : 
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేసి స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తెలిపింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 588వ రోజుకు చేరాయి. శుక్రవారంనాటి దీక్షల్లో సింటర్‌ ప్లాంట్‌ ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు కెవి.సత్యన్నారాయణ మాట్లాడుతూ.. బిజెపి పాలనలో దేశ ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేలాది కంపెనీలు మూతపడటంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాjన్నారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని, బుల్లెట్‌ ట్రైన్లు తెస్తామని చెప్పి రైల్వే స్టేషన్లను అమ్మేస్తోందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి నేడు అందరి ఉద్యోగాలనూ తొలగిస్తోందన్నారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను విడిచిపెట్టకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాస్‌, ప్రనన్నకుమార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.