
ప్రజాశక్తి-దగదర్తి (నెల్లూరు జిల్లా) : దళితులపై జరుగుతోన్న దాడులను తిప్పికొట్టి వారికి రక్షణగా నిలబడుతామని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. దళితులపై దాడులను అరికట్టాలి అనే అంశంపై నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని జక్కా వెంకయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాల్యాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. దస్తగిరి మండలంలోని ఉప్పలపాడు, ఉలవపాళ్ల, చెన్నూరు, దగదర్తి గ్రామాల్లో దళిత, బలహీన వర్గాలపై దాడులు జరిగాయన్నారు. ఉలవపాళ్లలో జి.తేజపై ఎంపిటిసి మహేష్ నాయుడు దాడి చేసి దారుణంగా కొట్టటం దుర్మార్గమన్నారు. ఉప్పలపాడులో దళిత కౌలు రైతు తలారి రవి సాగు చేస్తున్న పంటను పెత్తందారులు ట్రాక్టర్‌తో దున్నించి నాశనం చేశారని తెలిపారు. దళితులకు అండగా నిలవాల్సిన పోలీసులు దాడి చేసిన వారికే కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. కర్నూలు, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న తప్పులపై ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ కేసులు పెట్టారన్నారు. విశాఖపట్నంలో దళిత యువకుడుకి శిరోముండనం చేశారన్నారు. ఈ నేపథ్యంలో దళితులంతా ఐక్యంగా ఉండాలని, తమ హక్కులపై చైతన్యం కావాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం దళితులకు తాము అండగా ఉంటామన్నారు. ప్రజా సంఘాల నాయకులు కర్ర పోలయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రజా సంఘాల జిల్లా నాయకులు మూలం రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘురామయ్య, ఆలూరి తిరుపాలు, గిరిజన సంఘం, ఐలు, జెవివి నాయకులు పాల్గొన్నారు.