Mar 19,2023 14:55

మహబూబాబాద్‌ : అకాల వర్షం, వడగళ్లవానతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివఅద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా మాటేడు గ్రామంలో రాత్రి వడగళ్లవానతో నష్టపోయిన పంటలను, పండ్లతోటలను ఆదివారం పరిశీలించారు. రాత్రి కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. మిరప, మక్కజన్న, మామిడి, టమాటో, వరి, కూరగాయలు వంటి పంటలతోపాటు కొన్ని చోట్ల ఇండ్లు దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అధికారులు పంట నష్టాల అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు. వ్యవసాయ, రెవెన్యూ వంటి శాఖల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని, పంట నష్టాల అంచనాలు తేలిన తర్వాత పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు పంటల నష్టం అంచనా వేస్తున్నామని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు.మంత్రి వెంట మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.