
ప్రజాశక్తి-అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.