Aug 02,2022 14:27

సెయింట్‌ కిట్స్‌: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ సమష్టిగా రాణించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 138 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని విండీస్‌ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. విండీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (68) అర్ధశతకం సాధించాడు. డెవాన్‌ థామస్‌ (31లి) కీలక సమయంలో రాణించి ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ తాజా విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా మారింది.
గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈసారి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (11), శ్రేయాస్‌ అయ్యర్‌ (10), రిషభ్‌ పంత్‌ (24), రవీంద్ర జడేజా (27), దినేశ్‌ కార్తీక్‌ (7) క్రీజులో కుదురుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు. హార్దిక్‌ పాండ్యా 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్‌ బౌలర్‌ ఒబెడ్‌ మెక్‌కారు 4 ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకుని భారత్‌ పతనాన్ని శాసించాడు. హౌల్డర్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు.