Nov 23,2022 21:30

భవిష్యత్‌లో వచ్చేవారికి ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇస్తారు
సిఆర్‌డిఏలో ముగిసిన విచారణ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:రాజధాని పరిధిలో భూములను ఇతరులకు కేటాయిస్తే భవిష్యత్‌లో ఇక్కడకు ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చే వారికి ఇళ్లస్థలాలు ఎక్కడ కేటాయిస్తారని రైతులు సిఆర్‌డిఏ కమిషనర్‌ను ప్రశ్నించారు. దీనివల్ల భవిష్యత్‌లో భూముల సమస్య ఏర్పడుతుందని తెలిపారు. రాజధాని ఏర్పాటు నాటికి 29 గ్రామాల్లో ఉన్న భూమిలేని పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడమూ కష్టవుతుందని వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఆర్‌-5జోన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతులతో సిఆర్‌డిఏ నిర్వహించిన విచారణ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా రైతులు తమ అభిప్రాయాలు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఏర్పాటు చేసిన రాజధాని మస్టార్‌ప్లాను 2050 వరకూ అమల్లో ఉండే విధంగా రూపొందించారని, అక్కడున్న సుమారు 53 వేల ఎకరాల భూములను కాలక్రమంలో అభివృద్ధి చేసే విధంగానూ ప్లాను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ క్రమంలో సుమారు లక్షన్నర మంది ప్రజలు ఇక్కడకు వస్తారని అంచనా వేశారని, ఇక్కడ ఉపాధి కోల్పోయినవారికి, ఇళ్లస్థలాలు లేనివారికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఇప్పటి నుండి రాబోయే 30 ఏళ్లకు అవసరమయ్యే విధంగా 2500 ఎకరాలు కేటాయించారని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌-5 జోన్‌కు తొలిదశలోనే 900 ఎకరాలు కేటాయించారని, మిగిలిన 30 ఏళ్ల్ల్లలో ఇక్కడకు వచ్చేవారందరికీ ఇవ్వాలంటే మొత్తం రాజధాని అంతా ఇళ్లస్థలాలకే సరిపోతుందని తెలిపారు. ఇక అభివృద్ధి ఎక్కడని రైతులు కమిషనర్‌ను నిలదీశారు. రాజధాని ప్రాంతంలో యువత అభివృద్ధి కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పినా సరైన శిక్షణ లేకపోవడంతో యువత ఆసక్తి చూపలేదని వివరించారు. రాజధానిలో 365 రోజులూ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని టిడిపి ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రస్తుతం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అభివృద్ధి చెందక ముందే భూములను ఇతరులకు కేటాయించడం ద్వారా భవిష్యత్‌లో ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం నాటికి సుమారు 15 వేలమందికి పైబడి రైతులు తమ అభిప్రాయాలను సిఆర్‌డిఏ అధికారులకు తెలిపారు.