Dec 02,2022 07:23
  • భోపాల్‌ దుర్ఘటనకు 38 ఏళ్లు


ది 1984వ సంవత్సరం డిసెంబర్‌ 2వ తేదీ రాత్రి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌ నగరం. అమెరికాకు చెందిన అతి పెద్ద బహుళజాతి కంపెనీ యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ (యు.సి.సి.) నుండి మిథేల్‌ ఐసోసైనేట్‌ (ఎం.ఐ.సి.-మిక్‌) అనే 41 టన్నుల విషపూరిత రసాయన వాయువు ఒక స్టోరేజ్‌ ట్యాంకు నుండి నిద్రిస్తున్న నగరమంతటా వ్యాపించింది. 2,500 మంది అప్పటికప్పుడే మరణించగా క్రమంగా మృతుల సంఖ్య 22 వేల మందికి చేరింది. దాదాపు అయిదు లక్షల యాభైవేల మంది ప్రజలు తీవ్రమైన ప్రభావానికి గురయ్యారు. వందలాదిమంది శాశ్వతంగా వికలాంగులయ్యారు. గర్భిణీ స్త్రీలు మృత శిశువులను ప్రసవించారు. 15 వేల పశువులు, ఇంకా వేల సంఖ్యలో పక్షులు కూడా చనిపోయాయి. ఈ విషవాయువు వల్ల సంభవించే దీర్ఘకాలిక ప్రభావాల వల్ల నేటికీ ప్రజలు వైద్యం చేయించుకోవాల్సి వస్తున్నది.
         ఈ దారుణమైన దుర్ఘటనకు కారకులెవరు? నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందా? బాధ్యులకు శిక్షపడిందా? భోపాల్‌ ప్రజలకు తగిన విధంగా నష్టపరిహారం ఇచ్చారా? వారి వైద్య ఖర్చులు చెల్లించారా? ఇలాంటివి జరగకుండా అడ్డుకునేందుకు, జవాబుదారీతనం కల్పించేందుకు భారత ప్రభుత్వం గుణపాఠాలు తీసుకుందా? వీటన్నింటికీ ఒకే ఒక విషాదకరమైన సమాధానం ' లేదు ' అని మాత్రమే. అణుప్రమాదాల చరిత్రలోనే అతిపెద్దదైన ప్రమాదం జపాన్‌లోని ఫుకుషిమా ఘటన. దీని నుండి కూడా మన పాలకులు ఎటువంటి పాఠం నేర్చుకోలేదు. దీనికి మరో నిదర్శనం మన దేశంలో అణు ప్రమాదాలు సంభవించినప్పుడు అమెరికా కంపెనీలు బాధితులకు పరిహారం చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వటం.
          భోపాల్‌ ప్లాంట్‌లో భద్రతాచర్యలు లేవనే సమస్యను ఆ ప్లాంట్‌లోని కార్మిక సంఘాలు పదే పదే లేవనెత్తాయి. వాటిని యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ చివరకు బాధపడిందెవరు? కార్మికులు, భోపాల్‌లోని పేదలు మాత్రమే. ప్లాంట్‌ చుట్టూ ఉన్న కార్మికుల కాలనీలు, పేదల బస్తీలు, మురికివాడల్లో నివసించేవారే ఎక్కువగా నష్టపోయారు. అందువల్ల న్యాయం కోసం జరిగిన ఈ పోరాటం కూడా దోపిడీ చేసేవారికి, బహుళజాతి కంపెనీల అత్యాశకు, ప్రభుత్వంలోని వారి మద్దతుదార్లకు వ్యతిరేకంగా దోపిడీకి గురౌతున్న పేదలు జరిపిన పోరాటమే. ఈ మొత్తం విషాదగాథ కొన్ని కఠోర సత్యాలను మన ముందుంచాయి. యుపిఎ, ఎన్‌డిఎ కేంద్ర ప్రభుత్వాలు అమెరికా, భారత బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడుతూ వచ్చాయనేది మొదటిది. న్యాయ వ్యవస్థలో కూడా ఈ వర్గ పక్షపాతం ప్రతిబింబించింది. ఇక రెండవ సత్యం మరణించిన 22 వేల మంది, గాయపడిన లక్షలాది మంది ప్రజలు పేదవారే.
ప్రపంచంలో ఎక్కడా ఎవరూ ఉపయోగించ వీలులేని అధ్వాన్నమైన టెక్నాలజీని భోపాల్‌లో వాడినట్లు గ్యాస్‌ దుర్ఘటన సంభవించేవరకూ తెలియదు. ఇప్పటికీ భోపాల్‌ యు.సి.సి. ప్లాంట్‌లో వేలాది టన్నుల విషపూరిత పదార్థాలున్నాయి. ఆ విషపూరిత వ్యర్థాలు తీవ్ర పరిణామాలతో భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. వీటిని సక్రమంగా నిల్వ చేయకపోవడం వల్ల ప్రమాదం కొనసాగుతూనే ఉంది.
       కార్పొరేట్‌, ఎం.ఎన్‌.సి శక్తివంత కంపెనీలు తమ చేష్టల వల్ల ప్రస్తుత తరంపైనా, రేపటితరాలపైనా చూపే ప్రభావాల గురించి పట్టించుకోవు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఆర్జించే ఏకసూత్ర కార్యక్రమం వారిది. కాబట్టి మన దేశంలో పరిహారాలకు సంబంధించి కఠినమైన చట్టాలు తేవాలి. భోపాల్‌ దుర్ఘటనను ఎన్నడూ మరచిపోరాదు. దీనికి కారకులైనవారిని బోనులో నిలబెట్టాలి. యు.సి.సి ని చేపట్టిన నేటి డోవ్‌ కెమికల్‌ లేదా కేంద్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు భోపాల్‌ ప్లాంట్‌లోని వ్యర్థ పదార్థాలను తొలగించే బాధ్యత చేపట్టాలి. నష్ట పరిహారం పెంచాలి. బాధితుల కోసం సక్రమమైన వైద్య వ్యవస్థను ఏర్పాటుచేసి వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ఒక స్వతంత్య్ర, స్వయంపాలక అణు భద్రతా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. భోపాల్‌ దుర్ఘటన నుండి గుణపాఠం నేర్చుకోకపోతే భవిష్యత్‌ తరాలు పాలక వర్గాలను క్షమించవు.

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌