May 26,2023 08:13

రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడంలేదనేది స్పష్టమౌతున్నది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో, ప్రజల జీవితాల్లో తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్లు పేదరికం, నిరుద్యోగం తగ్గక పోగా ఆదాయ అసమానతలు, జిల్లాల మధ్య అంతరాలు ఎక్కువవుతున్నాయి.

వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ అత్యధిక మంది ప్రజల జీవితాలు మెరుగు పడకపోగా ఆహార పంటల నుండి భూమి వ్యవసాయేతర కార్యకలాపాలకు, పెద్ద పెట్టుబడులతో సాగయ్యే కార్యకలాపాలకు మార్పిడి జరుగుతున్నది. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి సమస్య జఠిలం అవుతున్నది. వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య కార్యకలాపాలు పెద్దపెద్ద పెట్టుబడులకు కేంద్రమౌతున్నాయి. సంపద కేంద్రీకృతమౌతున్నది.

          రాష్ట్రంలో పెరుగుతున్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (ఎస్‌జిడిపి)పై గత కొంత కాలంగా చర్చ నడుస్తున్నది. తమ ప్రభుత్వ విధానాల వల్లే జిడిపి వేగంగా పెరుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. అంతేకాక పెరుగుతున్న జిడిపి వల్ల రాష్ట్రంలో అభివృద్ధితో పాటు ప్రజా జీవనం అన్ని విధాలుగా మెరుగు పడుతున్నదని, పేదరికం, నిరుద్యోగం బాగా తగ్గిపోతున్నదని, ప్రాంతాల మధ్య అసమానతలు కూడా తగ్గుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సామాజిక, ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రూ.13.17 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలుగా నమోదయ్యింది. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే ఎక్కువగా కూడా ఉంది. దేశ జిడిపిలో రాష్ట్రం 8వ స్థానంలోను, దేశ సగటు తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉంది. రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 36.19 శాతం, పారిశ్రామిక రంగం వాటా 23.36 శాతం, సేవారంగం వాటా 40.45 శాతం ఉంది. ఈ మూడు రంగాల నుండి ఒక ఏడాదిలో వచ్చే ఆదాయాన్నే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటాం.
            ఈ అంకెలు, ప్రభుత్వ ప్రచారాన్ని బట్టి చూస్తే ఎవరైనా బోల్తా పడతారు. రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుందనే భ్రమల్లో పడతారు. కానీ రాష్ట్ర జిడిపిని లోతుగా పరిశీలిస్తే అభివృద్ధి ఎవరికి జరుగుతుందో? రాష్ట్రంలో సృష్టి అవుతున్న సంపద ఎవరి పరం అవుతున్నదో? రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలు అర్థమౌతాయి. ఎస్‌జిడిపి అంకెల బండారం బయట పడుతుంది.
వ్యవసాయ రంగాన్నే చూద్దాం. వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి అవుతున్నదని వ్యవసాయం మీద ఆధారపడ్డ వారి ఆదాయాలు బాగా మెరుగు పడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. దీనికి రెండు ప్రధాన కారణాలను ప్రభుత్వం చూపుతున్నది. దేశ జిడిపిలో వ్యవసాయ రంగం వాటా బాగా పడిపోతున్నదని. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ రంగం వాటా పెరుగుతున్నదని, వ్యవసాయ రంగం వృద్ధిరేటు కూడా దేశానికి భిన్నంగా రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నదని చూపుతున్నది. అంకెలు, ప్రభుత్వ ప్రకటనలు చూస్తే వాస్తవమేననే భావన కలుతుంది. కానీ లోతుల్లోకి వెళ్ళి విశ్లేషణ చేస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోవడంతో పాటు వ్యవసాయ రంగంలో పెట్టుబడి కేంద్రీకరణ వేగంగా పెరుగుతున్నట్లు మనకి అర్థమౌతుంది.
           రాష్ట్ర జిడిపికి వ్యవసాయ రంగం నుండి 2022-23లో రూ. 4.39 లక్షల కోట్లు సమకూరింది. అదే ఏడాది వ్యవసాయ రంగ వృద్ధిరేటు 13.18గా నమోదయ్యింది. వ్యవసాయ రంగంలో ఆహార పంటలు, ఉద్యాన పంటలు, పశు, చేపలు, రొయ్యలు, అటవీ సంబంధిత విభాగాలు ఉంటాయి. దీనినే ప్రాథమిక రంగం అని కూడా అంటారు. వ్యవసాయం మీద ఇప్పటికీ రాష్ట్రంలో 62.17 శాతం మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో 25 శాతం మంది ఆహార పంటల మీదే జీవనం సాగిస్తుంటారు. వ్యవసాయ రంగంలో మిగిలిన వాటి మీద ఆధారపడే వారు చాలా తక్కువ మంది మాత్రమే.
వ్యవసాయ రంగంలో గత ఏడాదిలో వచ్చిన సంపదను పరిశీలిస్తే అత్యధిక మంది ప్రజలు ఆధారపడ్డ ఆహార పంటల నుండి కేవలం 12.13 శాతం మాత్రమే సృష్టించబడింది. మిగిలిన ఉద్యానవనాలు 28.09 శాతం, పశు సంబంధిత ఆదాయం 32.06 శాతం, చేపలు, రొయ్యలు 25.29 శాతం, అటవీ సంపద నుండి 2.21 శాతం సమకూర్చబడింది. సుమారు 60 శాతం ఆదాయం వ్యవసాయ రంగంలో చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ, ప్లాంటేషన్‌ల నుండి వస్తున్నదనేది స్పష్టమౌతున్నది. ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే రొయ్యలు, చేపల చెరువుల నుండి రూ.1.11 లక్షల కోట్లు ఆదాయం వస్తే, ఆహార పంటల నుండి కేవలం రూ.54, 161 కోట్లు మాత్రమే వచ్చింది. అదే 2011-12లో చూస్తే ఆహార పంటల నుండి రూ.29.282 కోట్లు వస్తే చేపలు, రొయ్యల నుండి రూ.11,877 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. గడిచిన పదేళ్ళలో వ్యవసాయంలో ఆహార ధాన్యాల పంటల కన్నా చేపలు, రొయ్యల సాగు ఆదాయం రెండు రెట్లు పెరిగింది. ఆహార ధాన్యలు పండించే రైతులు సుమారు 50.92 లక్షల మంది (కౌలు రైతులు మినహా) ఉండగా చేపల, రొయ్యల సాగు చేసే రైతులు కేవలం 61,682 మంది మాత్రమే ఉన్నారు. అలాగే గత దశాబ్దం నుండి రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 155 లక్షల టన్నుల చుట్టే తిరుగుతున్నది. తలసరి ఆహార ధాన్యాల వినియోగం బాగా తగ్గింది. ఆహార ధాన్యాలు పండించే భూమి ఈ కాలంలో 44 లక్షల హెక్టార్ల నుండి 39.59 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది.
          మొత్తంగా చూస్తే వ్యవసాయ రంగంలో 85 శాతం ప్రజల ఆదాయాలు నామమాత్రంగా ఉన్నాయనేది స్పష్టమౌతున్నది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం కనిపించటం లేదు. వ్యవసాయ రంగం నుండి వచ్చే ఆదాయంలో అత్యధిక భాగం కొద్ది మందికి మాత్రమే వెళుతున్నది. ఈ పరిణామం వ్యవసాయ రంగంలో సంపద, భూ కేంద్రీకరణ, రైతులు, భూములు కోల్పోవటం వంటి చర్యలకు దారి తీస్తున్నది. ఫలితంగా అత్యధిక రైతాంగం సంక్షోభంలోనే కొనసాగుతున్నారు. ఈ వాస్తవ పరిస్థితిని ఎస్‌జిడిపి అంకెలు మరుగున పరుస్తున్నాయి. ఈ దుస్థితిలో గ్రామీణ ప్రజలు ఎక్కువభాగం కుటుంబ పోషణ కోసం పాడి పరిశ్రమను ముఖ్యమైన వృత్తిగా మార్చుకున్నారు. ఫలితంగా మన రాష్ట్రం పాల ఉత్పత్తిలో దేశంలో 5వ స్థానంలో నిలిచింది.
            ఇక పారిశ్రామిక రంగం చూస్తే రాష్ట్ర జిడిపిలో దీని వాటా క్రమంగా తగ్గిపోతున్నది. రాష్ట్ర విభజన అనంతరం 2013-14లో రాష్ట్ర జిడిపిలో పరిశ్రమల వాటా 25.17 శాతం ఉంటే 2022-23కి 23.36కి పడిపోయింది. 2.83 లక్షల కోట్ల సంపద సృష్టి అయ్యింది. వస్తు తయారీ రంగం చూస్తే ఎదుగుబొదుగు లేకుండా జిడిపిలో 10 శాతం చుట్టే తిరుగుతున్నది. పారిశ్రామిక నిర్మాణ రంగం వాటా కూడా గత తొమ్మిదేళ్ళల్లో జిడిపిలో 9.53 శాతం నుండి 6.91 శాతానికి క్షీణించింది. పారిశ్రామిక రంగం మీద ఆధారపడ్డ జనాభా చూస్తే కేవలం 18 శాతానికి మించి లేరు. ప్రస్తుత ప్రభుత్వంతో పాటు గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా రాష్ట్ర పారిశ్రామికీకరణ గురించి తెగ గొప్పలు చెప్పారు. ఐటీ హబ్‌లు, పారిశ్రామిక క్లస్టర్లు, గ్రోత్‌ సెంటర్లు, కారిడార్లు...ఎక్కువ భాగం నత్తనడకనే సాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుల పేర రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటనలు చేస్తున్నారు. కాని వాస్తవ పరిస్థితి తలకిందులుగా ఉంది. సహకార రంగంలోని చెక్కర, డెయిరీ వంటి పరిశ్రమలతోపాటు జూట్‌ మిల్లులు అనేకం మూతబడ్డాయి. ప్రభుత్వ పెట్టుబడులున్న పరిశ్రమలను, సహజ వనరులను కూడా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తూ భారీగా రాయితీలు ఇస్తున్నారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల కల్పన స్తంభించిపోయింది.
          మూడోది సేవారంగం. ఈ రంగం వాటా కూడా రాష్ట్ర జిడిపిలో 2013-14 లో 44.61 శాతం ఉంటే 2022-23కి 40.45 శాతానికి క్రమేణా తగ్గుతూ వచ్చింది. మరో ముఖ్య మైన పరిణామం ఏమంటే సేవా రంగంలో మూడో వంతు ఆదాయం రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌ రంగాల నుండి రావడం.
           2022-23లో సేవారంగం నుండి రూ.4.91 లక్షల కోట్ల సంపద సృష్టి అయ్యింది. ఇందులో రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌ కార్యకలాపాల నుండి రూ.1.54 లక్షల కోట్లు వచ్చింది. ఈ రంగంలో అతి తక్కువ ఉపాధి అవకాశాలు మాత్రమే కల్పించబడతాయి. ఉపాధి అవకాశాలు తక్కువగా కల్పించబడే కార్యకలాపాల నుండి సేవా రంగానికి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు స్పష్టమౌతున్నది. ఫలితంగా రాష్ట్ర జిడిపిలో 40.45 శాతం వాటా కలిగిన సేవారంగం మీద కేవలం 20 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో సృష్టించబడుతున్న ఆదాయంలో అతి తక్కువ మాత్రమే వేతనాల రూపంలో ఈ రంగంలోని ప్రజలకు దక్కుతున్నాయి. ఈ రంగంలో సంపద కేంద్రీకరణ తీవ్రంగా ఉన్నట్లు రూఢ అవుతున్నది.
రాష్ట్ర సగటు తలసరి ఆదాయం పెరుగుదలను కూడా అభివృద్ధిగా చూపించటం మరోటి. దేశ సగటు తలసరి ఆదాయం కంటే గత దశాబ్దం నుండి రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా కొనసాగటం వల్ల పేదరికం కూడా బాగా తగ్గిందనే ప్రచారం కూడా చేస్తున్నారు. కేంద్ర బిజెపి సర్కార్‌ సైతం తన విధానాల వల్లనే ప్రపంచంలో భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థగా రూపొందిందని గొప్పలు చెప్పుకుంటున్నది. కాని పోగుపడుతున్న జిడిపి లేదా సంపద ప్రజలకు కింది దాకా పున:పంపిణీ కావటం లేదు. పైన వ్యవసాయ రంగంలో పేర్కొన్నట్లు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరణ జరుగుతున్నది. నయా ఉదారవాద విధానాలు ప్రారంభం నుండి బూర్జువా ఆర్థికవేత్తలు, పాలకులు చెప్పుకుంటూ వస్తున్న ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం ఆచరణలో పెద్ద డొల్లతనంగా మారింది.
           ఇక రాష్ట్ర సగటు తలసరి ఆదాయం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే 13లో 9 జిల్లాలు రాష్ట్ర తలసరి సగటు కంటే దిగువ స్థాయిలో ఉన్నాయి. కేవలం విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నాయి. కొత్త జిల్లాల ఆధారంగా జిల్లాల తలసరి ఆదాయాలు ప్రభుత్వం విడుదల చేస్తే జిల్లాల మధ్య ఆర్థిక అసమానతలు, వెనుకబాటు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమౌతుంది.
పారిశ్రామిక రంగానికి విశాఖపట్నం, భోగాపురం, శ్రీ సిటీ వంటి కేంద్రాలు మాత్రమే ప్రధానమైనవిగా ఉన్నాయి. చేపలు, రొయ్యలు, చెరువులు, పౌల్ట్రీ, ప్లాంటేషన్‌లకు కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు వంటి కొన్ని జిల్లాలు మాత్రమే కీలకంగా ఉన్నాయి. సేవారంగం కేవలం కొన్ని పెద్ద నగరాలకే పరిమితమై ఎక్కువ ఆదాయాన్ని జిడిపికి సమకూరుస్తున్నది.
పెరుగుతున్న జిడిపి రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యకు ఏమాత్రం పరిష్కారం చూపడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 6.15 శాతంగా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2020-21 తెలిపిన వివరాలు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర జనాభాలో 48.4 శాతం ప్రజలు శ్రామికులుగా వివిధ పనుల్లో జీవనం సాగిస్తున్నారు. దేశంలో శ్రామిక భాగస్వామ్యం తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం ఒకటిగా వుంది.15-29 వయస్సు మధ్య చూస్తే అతి తక్కువ మంది అనగా పట్టణ ప్రాంతంలో 17 శాతం, గ్రామీణ ప్రాంతంలో 32.9 శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు. పట్టభద్రులలో చూస్తే ప్రతి 10 మందిలో నలుగురు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారు. మొత్తం చదువుకున్న నిరుద్యోగుల్లో 73 శాతం మంది పట్టభద్రులే. ఎంప్లారుమెంట్‌ ఎక్ఛేంజ్‌లలో ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నవారు 16 లక్షల మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం పేదలకు ముఖ్యమైన ఉపాధిగా ఉంది. ఇంజనీరింగ్‌ చదువుకున్న పట్టభద్రుడికి రాష్ట్రంలో కనీస స్థాయి వేతనం పొందగలిగే ఉపాధి లేదు. అత్యధిక మంది రాష్ట్రం వదిలి ఇరత రాష్ట్రాలకు పని కోసం వలస వెళ్తున్నారు.
            మరో పరిణామమేమంటే సంఘటిత రంగంలో ఉపాధి తగ్గిపోయి అసంఘటిత రంగం పెరుగుతున్నది. ఉపాధి కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు బాగా తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయటంలేదు. ఫలితంగా సంఘటిత రంగంలో ఉపాధి దారుణంగా పడిపోతున్నది. ప్రైవేటు రంగంలో కూడా సంఘటిత ఉపాధి నామమాత్రంగా మారింది. శ్రమ దోపిడి తీవ్రంగా ఉంది.
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయడంలేదనేది స్పష్టమౌతు న్నది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో చోటుచేసు కుంటున్న పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో, ప్రజల జీవితాల్లో తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్లు పేదరికం, నిరుద్యోగం తగ్గక పోగా ఆదాయ అసమానతలు, జిల్లాల మధ్య అంతరాలు ఎక్కువవుతున్నాయి. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ అత్యధిక మంది ప్రజల జీవితాలు మెరుగు పడకపోగా ఆహార పంటల నుండి భూమి వ్యవసా యేతర కార్యకలాపాలకు, పెద్ద పెట్టుబడులతో సాగయ్యే కార్యకలాపాలకు మార్పిడి జరుగుతున్నది. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి సమస్య జఠిలం అవుతున్నది. వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య కార్యకలాపాలు పెద్దపెద్ద పెట్టుబడులకు కేంద్రమౌతున్నాయి. సంపద కేంద్రీకృతమౌతున్నది.

/ వ్యాసకర్త సెల్‌ : 9490098792 /
డా|| బి.గంగారావు

డా|| బి.గంగారావు