May 06,2023 12:25

జోగులాంబ గద్వాల : ఫెవీక్విక్‌ యాడ్స్‌ చూస్తూనే ఉంటాం.. ఇక ఇవి పనికిరావు అనుకునే సామాన్లను ఓ అమ్మాయి బయటపడేస్తుంటే.. ఓ అవ్వ ఆ వస్తువులన్నిటినీ తీసుకొని ఫెవీక్విక్‌తో అతికించేసి అలంకరించుకుంటుంది.. ఆ బామ్మను చూసి ఆ అమ్మాయి అవాక్కవుతుంది.. ఎలాంటి వస్తువులనైనా ఫెవీక్విక్‌ ఇట్టే అతికించేస్తుంది అంటూ యాడ్‌లో చెబుతుంటారు.. అయితే ఓ ప్రైవేటు ఆసుపత్రివారు ఫెవీక్విక్‌ను ఎలాంటి గాయానికైనా వాడేయొచ్చు..! అన్నట్లు చేశారు. ఓ పిల్లాడి తలకు తీవ్రంగా దెబ్బతగిలి రక్తస్రావమవుతుంటే.. కుట్లు వేయాల్సిన చోట ఫెవీక్విక్‌ తో అంటించి ఆ పనైపోయింది వెళ్లు.. అన్నారు.. తీరా ఆ పిల్లాడి తల్లిదండ్రులు సంగతి గమనించి డాక్టర్‌ను నిలదీస్తే నాది పూచీ ఏమీ కాదులే.. అన్నాడు. చేసేదిలేక ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగిందంటే... కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు తమ కుమారుడితో కలిసి తమ బంధువుల ఇంట్లో పెళ్లి కార్యక్రమానికి రెండ్రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు వెళ్లారు. వీరి ఏడేళ్ల కుమారుడు ప్రవీణ్‌ చౌదరి గురువారం రాత్రి ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో ఎడమ కంటికి పైన తీవ్ర గాయమైంది. రక్తస్రావమవుతుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయం లోతుగా అవ్వడంతో అక్కడ కుట్లు పడాల్సి ఉంది. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం కుట్లకు బదులు.. ఫెవిక్విక్‌తో అంటించి వైద్యం చేశారు. అది గుర్తించిన బాలుడి తండ్రి కృష్ణవంశీ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. ఫెవిక్విక్‌తో అంటించి వైద్యం చేయటమేంటి ? ఇన్‌ఫెక్షన్‌ అయితే ఎవరిది బాధ్యత ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సదరు ఆసుపత్రి డాక్టర్‌ని అడిగితే ... సిబ్బంది పొరపాటు చేసి ఉండొచ్చని, బాలుడికి ఏమీ కాదని నచ్చజెప్పాడు. ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానని తండ్రికి హామీ ఇచ్చాడు. చేసేదేమీలేక ఆ బాలుడి తండ్రి అయిజ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.