Sep 29,2022 21:49
  • 27 మంది ఎమ్యెల్యేలపై జగన్‌ అసంతృప్తిగా ఉన్నారన్నది అవాస్తవం
  • మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ, విశాఖ :  రుషికొండపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కడితే తప్పేమిటని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుషికొండపై జరుగుతోన్న నిర్మాణాలపై స్వయంగా తను మీడియాను తీసుకెళ్లి చూపిస్తానన్నారు. ఇక్కడ గతంలో గెస్ట్‌ హౌస్‌ ఉండేదని, దానిని పడగొట్టి మరో గెస్ట్‌ హౌస్‌ కడుతున్నామని తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే విశాఖలో అభివృద్ధి జరిగిందని, విమ్స్‌, హెల్త్‌ సిటీ, ఫార్మాసిటీ, ఐటీ సెజ్‌, గంగవరం పోర్టు వచ్చాయని తెలిపారు. 27 మంది ఎమ్యెల్యేలపై జగన్‌ అసంతృప్తిగా ఉన్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాము 175 సీట్లు గెలవటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకునే క్రమంలోనే పార్టీ సమావేశం జరిగిందన్నారు. అమరావతి రైతుల ముసుగులో టిడిపి పాదయాత్ర చేస్తోందన్నారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన టిడిపి నేతలు విశాఖపట్నానికి ఏమిచేశారో చెప్పాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా విశాఖకు రాజధాని రావడం ఖాయమన్నారు. దీనిని అడ్డుకున్నవారు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. ఎపి ఉపాధ్యాయుల పరిస్థితి బాగాలేదని తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఇక్కడి టీచర్లకు ఫిట్‌మెంట్‌, పిఆర్‌సి ఎంత ఇచ్చామో చూసి వారివద్ద ఎంత ఉందో చూసుకోవాలని హితవుపలికారు.