
అమరావతి : వాట్సాప్ వాడని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్ ఉంటే చాలు.. క్షణాల్లో ఫొటో, వీడియో, ఆడియోలను షేర్ చేయొచ్చు. నిరంతరం వాట్సాప్ వేదికగా ఎంతో సమాచారాలు బదిలీలవుతూనే ఉంటాయి. ఈ బదిలీలలో.. స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు ఉంటే, కొంతమంది ప్రజల అవగాహన కోసం కొన్ని కంటెంట్లను షేర్ చేస్తుంటారు. కొంతమంది గ్రూపుల్లో లేదా ఇతరుల నుండి వచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవకుండానే మరొకరికి షేర్ చేసేస్తుంటారు. వాటిలో నకిలీ, మాల్వేర్, విద్వేషపూరితమైన సమాచారం ఉంటే.. తెలీక పూర్తిగా చదవకుండానే వాటిని వేరొకరికి షేర్ చేస్తే.. ఇంకేముంది జైలుపాలే..!
కొన్ని కంటెంట్లను షేర్ చేస్తే జైలుకే : యూజర్లకు వాట్సాప్ హెచ్చరిక
వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయ్యే సమాచారం ద్వారా సైబర్ మోసాలు, నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు వాట్సాప్.. యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల మేరకు ... కొన్ని కేటగిరీల కంటెంట్లను వివరించింది. ఆ కేటగిరీలోని కంటెంట్‌ను ఇతరులతో షేర్ చేస్తే జైలుపాలయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.
అశ్లీల కంటెంట్లు...
కొంతమంది వాట్సాప్ గ్రూపులో అశ్లీల కంటెంట్లను షేర్ చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో అడల్ట్ కంటెంట్ షేర్ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి కంటెంట్ గురించి గ్రూపు సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే, అది షేర్ చేసిన వ్యక్తితోపాటు, గ్రూపు అడ్మిన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సమాచారం వాట్సాప్‌లో ఎవరు షేర్ చేసినా వెంటనే దాన్ని డిలీట్ చేయడం ఉత్తమం. ఇతరుల నుంచి వచ్చినా దాన్ని షేర్ చేయొద్దని వాట్సాప్ సూచిస్తోంది.
కాపీరైట్స్ ప్రొటెక్షన్ ఉన్నవి...
కొన్ని రచనలు, వీడియో, ఆడియోలు చాలా ఆసక్తిగా ఉంటాయి. వెంటనే వాటిని తెలిసినవారికి షేర్ చేస్తుంటాం. అలా షేర్ చేసిన సమాచారానికి కాపీరైట్ ప్రొటెక్షన్ ఉంటే చిక్కుల్లో పడ్డట్లే. అది తమ మేధో సంపత్తిగా చెబుతూ.. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ మీకు కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే కాపీరైట్ ప్రొటెక్షన్ ఉన్న సమాచారం షేర్ చేయకపోవడం ఉత్తమం.
అశ్లీలంగా ఎడిట్ చేసినవి..
కొంతమంది సరదా కోసం తమ స్నేహితులకు తెలియకుండా ఫొటో, వీడియోలు తీసి తెలియని నంబర్ల నుంచి పంపుతుంటారు. దాంతో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందంటూ.. సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయొచ్చు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ఫొటో, వీడియోలను యూజర్ అనుమతి లేకుండా కొంతమంది ఆకతాయిలు సేకరిస్తున్నారు. వాటిని అశ్లీలంగా ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. చట్టప్రకారం ఇలా చేయడం నేరం. అందుకే వాటి జోలికి అస్సలు పోవద్దని వాట్సాప్ యూజర్లకు సూచిస్తోంది.
సంఘవిద్రోహశక్తులకు సంబంధించిన కంటెంట్లు..
ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు సంబంధించిన లేదా వారి చర్యలను ప్రోత్సహించే విధంగా ఉండే సమాచారం వాట్సాప్‌లో షేర్ చేయడం నేరం. దేశ భద్రతను దఅష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంఘవిద్రోహశక్తులకు సంబంధించిన కంటెంట్ షేరింగ్‌పై నిఘా పెడుతుంది. ఒకవేళ మీకు ఏదైనా వ్యక్తి లేదా గ్రూపు నుంచి అలాంటి మెసేజ్ వస్తే సదరు ఖాతాపై ఫిర్యాదు చేయవచ్చు.