Feb 01,2023 19:52

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : సిఎం ఎక్కడ నుంచి పాలిస్తే అదే రాష్ట్ర రాజధాని అవుతుందని, విశాఖ రాజధానిగా అక్కడ్నుంచే పాలిస్తానని ప్రకటించడంపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ నగరానికి రహదారి, రైల్వే, విమాన, సముద్రయాన రంగాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ ఉందన్నారు. ఈ ప్రాంతం రాజధానిగా ఏర్పాటు కావడం ద్వారా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక దిగ్గజాలు సైతం విశాఖపై ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని సువిశాల తీర ప్రాంతం ఇండిస్టియల్‌ కారిడార్‌గా మారబోతుందన్నారు. పోర్టులు, హార్బర్లు, జెట్టీలు యుద్ధప్రాతిపదికన నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. లోకేష్‌ పాదయాత్రను డైవర్ట్‌ చేయడానికే సిఎం విశాఖను రాజధానిగా ప్రకటించారంటూ టిడిపి నాయకులు ఆరోపణలు చేయడం.. అది ఈ శతాబ్దపు జోక్‌గా అభివర్ణించారు. కోటంరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతున్నారంటున్న ఎమ్మేల్యేల పేర్లు ఆయన బయటపెట్టాలన్నారు.