Oct 05,2022 09:31
  • సచివాలయ ఉద్యోగులకు భారంగా మారిన ప్రైవేటు వైద్యం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికీ ఇహెచ్‌ఎస్‌ (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌) కార్డులు అందకపోవడం పట్ల వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం చేయించుకోవడం శక్తికి మించిన భారంగా మారుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇహెచ్‌ఎస్‌ కోసం గత మూడు నెలలుగా జీతాల నుంచి ప్రీమియం ప్రభుత్వానికి చెల్లిస్తున్నా.. ఇహెచ్‌ఎస్‌ కార్డులు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్టవ్యాప్తంగా సుమారు 95 వేలమంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా, ఒక్కొక్కరు నెలకు రూ.225 చొప్పున మూడు నెలలకు మొత్తం రూ.6.75 కోట్లు ప్రీమియం రూపేణా చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల డేటాను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టుకు, ట్రెజరీ నుంచి పంపకపోవడంతో ఉద్యోగుల వివరాలు మ్యాపింగ్‌ కాలేదు. ఫలితంగా ఇహెచ్‌ఎస్‌ లాగిన్‌లో డేటా కనపడని పరిస్థితి నెలకొంది.
 

                                                                       90 శాతానికి పైగా పేదవారే..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో 90 శాతానికి పైగా పేద, మధ్యతరగతికి చెందిన వారే ఉద్యోగులుగా ఉన్నారు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులమని, ప్రభుత్వపరంగా మిగిలిన ఉద్యోగుల తరహాలో తమకు అందాల్సిన బెనిఫిట్స్‌ ఏమీ అందడం లేదని వాపోతున్నారు. తెల్ల రేషన్‌ కార్డులు రద్దు చేయడంతో ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. తమ కుటుంబ సభ్యులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించడం శక్తికి మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎపిజిఎల్‌ఐ కోసం నెలనెలా ప్రీమియం చెల్లిస్తున్నా.. ఆ సౌకర్యం కూడా అందుబాటులోకి రాలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
          బాండ్లు రిలీజ్‌ అయితేనే ఉద్యోగులకు ఆర్థికసాయం అందే పరిస్థితి ఉంటుంది. లేనిపక్షంలో ఉద్యోగికి ఏదైనా అనుకోని సంఘటన జరిగి మరణించినా బీమా సౌకర్యం, గ్రేడ్‌లు వారీ ప్యాకేజీ, ఉద్యోగి మరణిస్తే వారి అంత్యక్రియల కోసం, మట్టి ఖర్చుల కోసం ప్రభుత్వం ఇచ్చే సహాయం అందే పరిస్థితి కనబడటం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇహెచ్‌ఎస్‌ కార్డులు మంజూరు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.