Jul 01,2022 16:36

ముంబయి :  బిజెపి యేతర పార్టీ కోసం ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి అధికార పార్టీ సిద్ధపడినపుడు.. 2019 సమయంలో ఎందుకు అంగీకరించలేదని శుక్రవారం ఉద్ధవ్‌ థాకరే విమర్శించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన రెండు రోజుల అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రి కుర్చీ పంపకానికి ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు. అమిత్‌షా తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఉంటే ఇప్పటికీ మహారాష్ట్రకు బిజెపి అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు. శివసేనను చీల్చడం వల్ల బిజెపికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తనను బెదిరించినట్లు ప్రజల్ని బెదిరించవద్దని విజ్ణప్తి చేశారు.

బిజెపికి ఏం సాధించిందో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి రాలేదని, అటువంటప్పుడు కుర్చీ పంపకంపై గతంలో ఎందుకు వ్యతిరేకించినట్లని ప్రశ్నించారు. నన్ను వెనక్కి నెట్టినట్లు.. ముంబయిని వెనక్కి నెట్టవద్దని కోరారు. ఆరే కాలనీ విషయంలో నిర్ణయం మార్పుకోవడం సరైంది కాదని అన్నారు.  మహావికాస్‌ అఘాడీ (ఎంవిఎ) ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించిందని, అది నచ్చకపోతే ఆరేకు నష్టం జరగకుండా మరో విధానాన్ని తీసుకురావాలని సూచించారు.  ఏదేమైనా పర్యావరణ సహితంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జరిగిన మొదటి క్యాబినెట్‌ సమావేశంలో ఆరెపై ఎంవిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే.  గత ఎంవిఎ ప్రభుత్వం మెట్రో లైన్‌-3 కార్‌ షెడ్‌ను ఆరె కాలనీ నుండి కంజుర్‌మార్గ్‌కు మార్చగా.. దీనిని కంజుర్‌మార్గ్‌ నుంచి మళ్లీ ఆరె కాలనీకి మారుస్తున్నట్లు షిండే ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.