Feb 08,2023 10:51
  • కులవ్యవస్థకు మనుధర్మం కారణం కాదా ?
  • మోడీ పాలనలో ఉపాధి హామీ నిర్వీర్యం : విజయరాఘవన్‌

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాల గురించి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయనీ, చర్చ చేపట్టాల్సిందేనంటూ రెండురోజులుగా పార్లమెంటును స్థంభింపజేశాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. కానీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. చర్చ చేపట్టేందుకు భయమెందుకని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజల సొమ్మును అదానీ సంస్థ కాజేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అదానీపై కుట్ర జరుగుతున్నదనీ, అక్రమాల్లేవంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు చేస్తున్న కుట్ర అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులంటున్నారని చెప్పారు. అది కుట్రా, కాదా?అన్నది పార్లమెంటులో చర్చించాలన్నారు. ఆ కుట్రలను ప్రభుత్వమే బట్టబయలు చేయాలనీ, కానీ చర్చించకుండా పార్లమెంటును ఎందుకు నిరోధిస్తున్నదనీ ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్టుగా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని కోరారు. న్యాయవ్యవస్థ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో రెండురోజులపాటు జరగనున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో రాఘవులుతోపాటు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్‌, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. ముందుగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ అదానీ కంపెనీల్లో రూ.80 వేల కోట్లు ఎల్‌ఐసి మదుపు చేసిందని, రూ.25 వేల కోట్లు ఎస్‌బిఐ రుణం ఇచ్చిందన్నారు. అవి మునిగిపోయినా, చెల్లించకపోయినా పర్వాలేదంటూ కేంద్రం భావిస్తున్నదని చెప్పారు. ప్రజల సొమ్ముకు గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. చర్చకు, విచారణకు, సమాధానానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడం అన్యాయం, అప్రజాస్వామికమని విమర్శించారు. కులవ్యవస్థ, అంటరానితనానికి కారణం పండితులు అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. శ్రమ గౌరవాన్ని పెంచాలనీ, అది లేకుండా పోతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. దేశంలో కులవ్యవస్థ మూలంగా శ్రమకు గౌరవం లేదని తామూ అంగీకరిస్తామన్నారు. మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలను వక్రీకరించారనీ, కులవ్యవస్థకు కారణం పూజారులు కాదనీ, మేధావులంటూ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన మరో ప్రతినిధి వ్యాఖ్యానించారనీ వివరించారు. మోహన్‌ భగవత్‌, హేడ్గేవార్‌, గోల్వాల్కర్‌ వంటి మేధావులు కారణమా?అని ప్రశ్నించారు. కులవ్యవస్థను కాపాడాలని చెప్పే మనుధర్మం రాసిన వారు కారణమా?అని అడిగారు. ఇవన్నీ వదిలేసి కొందరు వ్యక్తులపై నెట్టివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది కుల వ్యవస్థను కాపాడుకోవాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. దళితులు, ఇతర వెనుకబడిన కులాలను మోసం చేసే ప్రయత్నం ఇందులో ఉందని చెప్పారు. కులవ్యవస్థ పోతేనే శ్రమకు గౌరవం వస్తుందన్నారు. దాన్ని నిర్మూలించకుండా మభ్యపెట్టే మాటలను విరమించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను కోరారు. ఈనెల 16న త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయనీ, అయితే అక్కడ శాంతియుత పరిస్థితుల్లేవని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం కార్యాలయాలు, ఇండ్లు, దుకాణాలు, చేపల చెరువులపై బిజెపి గూండాలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయని అన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు ఈసీ చర్యలు చేపట్టాలని కోరారు.
 

                                                ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం : విజయరాఘవన్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం పరిరక్షణ కోసం ప్రజాపోరాటాలను నిర్మిస్తామని చెప్పారు. మోడీ పాలనలో సామాన్యుల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి గతేడాది కంటే నిధులు తగ్గించిందని అన్నారు. ఎక్కువ నిధులు కేటాయించి ఉపాధి హామీని పటిష్టం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకోవైపు మతతత్వ విధానాలతో ప్రజలను విభజిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కేటాయింపులు చేస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, వృత్తిదారులు, పేదల సంక్షేమానికి మరిన్ని నిధులు అవసరమని సూచించారు. అందుకనుగుణంగా బడ్జెట్‌ తుదిరూపం ఇచ్చేటపుడు మార్చాలని కోరారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాస్తామన్నారు. ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.