Jul 05,2022 10:29

ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు టిడిపి నేత నందం సుబ్బయ్యలాగే అందరినీ చంపేస్తారా ! అంటూ రాజుపాళెం మండలం జడ్పీటీసీ మాజీ సభ్యుడు, వైసిపి జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వెల్లాల నుంచి బైక్‌ పై ప్రొద్దుటూరుకు వస్తుండగా... కొర్రపాడు రోడ్డులోని టీవీఆర్‌ పెట్రోల్‌ బంకు వద్దకు రాగానే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వర్గీయులు రామాపురం గ్రామానికి చెందిన యాకోబ్‌, మరికొందరు కలిసి తనను బెదిరించారంటూ భాస్కర్‌ గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

                                    రౌడీలతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు : వైసిపి నేత భాస్కర్‌

వైసిపి నేత భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ ... ప్రొద్దుటూరులో నియంతగా పాలన చేయాలనుకున్న వ్యక్తులు జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను రాజుపాళెం జడ్పీటీసీ మాజీ సభ్యుడినని, తన భార్య రాజుపాళెం మండలం పగిడాల ఎంపీటీసీ సభ్యురాలు అని చెప్పారు. నిన్న తాను ప్రొద్దుటూరుకు వెళుతుండగా.. మార్గమధ్యంలో ఎమ్మెల్యే రాచమల్లు పంపించారని చెప్పి యాకోబ్‌, మరికొందరు తనను అడ్డగించారని తెలిపారు. ఎంపిటిసి సభ్యురాలి పదవికి రాజీనామా చేయిస్తారా.. లేక రూ.11 లక్షలు డబ్బులు కడతావా అని తనను బెదిరించారని చెప్పారు. డబ్బులు ఎందుకు కట్టాలని తాను వారిని ప్రశ్నించానని అన్నారు. ఎంపీటీసీ సభ్యురాలిగా ఏ విధంగా గెలిచారన్నారని వారు అడిగారని తెలిపారు. గెలిస్తే కూడా డబ్బులు ఇవ్వాలా అని ప్రశ్నించాననీ, తనకు ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వలేదని, తాము ప్రచారం..సేవ చేసి గెలిచామని చెప్పానన్నారు. రౌడీలతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని భాస్కర్‌ స్పష్టం చేశారు.

                          కొట్టడానికి..దౌర్జన్యాలు చేయడానికి ఎమ్మెల్యేని చేశామా ? : వైసిపి నేత భాస్కర్‌

ఈ బెదిరింపులపై ఎమ్మెల్యే రాచమల్లు సమాధానం చెప్పాలని వైసిపి నేత భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. తమను కొట్టడానికి..దౌర్జన్యాలు చేయడానికి ఎమ్మెల్యేని చేశామా ? అంటూ రాచమల్లుపై నిప్పులుచెరిగారు. తనకు మండలాధ్యక్షుడి పదవి ఇవ్వకపోయినా భరించానని, ఇప్పుడు దాడి చేసేందుకు మనుషుల్ని పంపడం ఏమిటి ? అని అడిగారు. ఈ మీడియా సమావేశంలో భాస్కర్‌తోపాటు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, అయిదో వార్డు వైసిపి కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ అనుచరులు దుగ్గిరెడ్డి రఘునాథ్‌రెడ్డి, ప్రసాద్‌ ఉన్నారు.