May 25,2023 22:15

ముంబయి: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముంగిట టీమ్‌ఇండియా సెలక్టర్లకు భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కీలక సూచన చేశాడు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ అందుబాటులో లేనందున అనుభవజ్ఞుడైన వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వఅద్ధిమాన్‌ సాహా సేవలను ఉపయోగించుకోవాలని సూచించాడు. ఆ దిశగా సెలక్టర్లు యోచన చేయాలని కోరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించారు. అందులో వఅద్ధిమాన్‌ సాహాకు చోటు దక్కలేదు. కేఎస్‌ భరత్‌కు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేశారు.
''ఒకవేళ అతడి (వఅద్ధిమాన్‌ సాహా)కు అవకాశం వస్తే నేను సంతోషిస్తా. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో కేఎస్‌ భరత్‌ ఆడాడు. వఅద్ధిమాన్‌ సాహాకు ఎన్నో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. కానీ, రిషభ్‌ పంత్‌ రాణించడంతో అతడికి అవకాశం రాలేదు. ఇది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది'' అని గంగూలీ పేర్కొన్నాడు.
జూన్‌ 7న లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు గంగూలీ చెప్పాడు. 'మ్యాచ్‌ హౌరాహౌరీగా సాగుందని అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారో నాకు తెలియదు. కానీ, భారత్‌ గెలవాలని నేను కోరుకుంటున్నా. ప్రస్తుతం 50-50 ఛాన్స్‌ ఉంది' అని గంగూలీ అన్నాడు. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పాలైన టీమ్‌ఇండియా.. ఈ సారి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది.